'బాహుబలి' సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ ఉలిక్కిపడేలా చేశాడు దర్శక ధీరుడు రాజమౌళి. బాలీవుడ్ రికార్డుల్ని తిరగరాసిన చిత్రంగా 'బాహుబలి' చరిత్రకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని బాలీవుడ్‌లో రిలీజ్ చేసిన దర్శక నిర్మాత కరణ్ జోహార్, అప్పటి నుండీ ఆ రేంజ్‌లో సినిమాకి బాలీవుడ్‌లో దర్శకత్వం వహించాలని కలలు కన్నారు. ఆ కలల్ని త్వరలో సాకారం చేసుకోనున్నారాయన. 'తఖ్త్' సినిమా ద్వారా 'బాహుబలి' రికార్డుల్ని ఢీ కొట్టేందుకు సిద్ధపడుతున్నారు. భారీ తారాగణంతో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని రూపొందిస్తున్నట్లు ఆయన తాజాగా తెలిపారు. ఈ సినిమాకి దర్శకత్వంలో పాటు, నిర్మాతగానూ కరణ్ జోహార్ వ్యవహరిస్తుండడం విశేషం.
ఇక ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్, అనిల్ కపూర్, అలియా భట్, కరీనా కపూర్, భూమి ఫడ్నేకర్, విక్కీ కౌషల్‌తో పాటు, జాన్వీ పూర్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. మొగలుల కాలం నాటి చారిత్రక కథాంశంతో ఈ సినిమాని రూపొందించనున్నారట. అందుకోసం భారీ సెట్స్‌ని సిద్ధం చేయనున్నారట. 'బాహుబలి' సెట్టింగ్స్‌ని తల దన్నేలా ఆ సెట్స్ ఉండబోతున్నాయట. వచ్చే నెల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారట. అన్నట్లు అప్పుడే సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు మన డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్. 2021 డిశంబర్ 24న 'తఖ్త్' ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేస్తూ అందుకు సంబంధించి ఓ శాంపిల్ టీజర్ కూడా రిలీజ్ చేశారు.