గురువారం రాత్రి హైదరాబాద్ లోని యూసుఫ్ గూడా రోడ్డుపై నటి కరాటే కల్యాణీ వీరంగం సృష్టించింది. యూట్యూబ్ స్టార్ శ్రీకాంత్ రెడ్డిపై చేయి చేసుకుని, చొక్కా చింపేసింది. అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. ఈ తతంగాన్ని కల్యాణీ ఫేస్ బుక్ ద్వారా లైవ్ కూడా ఇచ్చింది. కరాటే కల్యాణీకి, శ్రీకాంత్ రెడ్డికీ గొడవ జరుగుతున్నప్పుడు కల్యాణీ మనుషులు అక్కడికి కొంతమంది వచ్చారు. వాళ్లు కూడా శ్రీకాంత్ రెడ్డిపై చేయి చేసుకున్నారు.
శ్రీకాంత్ రెడ్డి యూ ట్యూబ్ లో ఫ్రాంక్ వీడియోలు చేస్తుంటాడు. కల్యాణీపై కూడా తను గతంలో ఓ వీడియో చేసినట్టు టాక్. దానికి సంబంధించి ఇద్దరి మధ్యా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి యూసుఫ్ గూడాలో మళ్లీ ఇద్దరూ ఎదురుబదురయ్యారు. ఇద్దరి మధ్యా మాటలు పెరిగాయి. ఈ సందర్భంగా కరాటే కల్యాణీ శ్రీకాంత్ రెడ్డిపై చేయి చేసుకుంది. వెంటనే శ్రీకాంత్ రెడ్డి కూడా కల్యాణీపై చేయి చేసుకున్నాడు. దాంతో దుమారం రేగింది. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు అటు కల్యాణీని, ఇటు శ్రీకాంత్ రెడ్డిని విచారిస్తున్నట్టు తెలుస్తోంది.