చిత్రం: సత్యం సుందరం
దర్శకత్వం: సి.ప్రేమ్ కుమార్
కథ - రచన : సి.ప్రేమ్ కుమార్
నటీనటులు: కార్తి, అరవింద స్వామి, శ్రీదివ్య, రాజ్‌కిరణ్, దేవదర్శిని, ఇళవరసు, శ్రీరంజని తదితరులు.
నిర్మాతలు: జ్యోతిక, సూర్య
సంగీతం: గోవింద్ వసంత
సినిమాటోగ్రఫీ: మహేంద్రన్ జయరాజు
ఎడిటర్: ఆర్.గోవింద రాజు
బ్యానర్: 2డీ ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ: 28 సెప్టెంబర్ 2024
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 3.5/5
'కార్తీ' పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. కోలీవుడ్ హీరో అయినా టాలీవుడ్ లో కూడా స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది కార్తీకి. సూర్య సినిమాల్లోకి ముందే వచ్చినా టాలివుడ్ లో కార్తీ కంటే వెనకపడ్డాడు. కార్తీ ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. అంతే కాక కార్తీ నేరుగా నాగార్జున తో కలిసి తెలుగులో 'ఊపిరి' సినిమా చేసి మరింత మందికి చేరువ అయ్యాడు. మొదట నుంచి ప్రయోగాలు చేస్తూ డిఫరెంట్ కాన్సెప్టు లు ట్రైచేస్తూ ఆడియన్స్ ని అలరిస్తూ ఉన్నాడు కార్తీ. అందుకే విభిన్న కథలకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు కార్తీ. ఇప్పుడు అరవింద్ స్వామితో కలిసి కార్తీ నటించిన 'సత్యం సుందరం' మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. '96' అనే మూవీతో మంచి పేరు తెచ్చుకున్న ప్రేమ్ కుమార్ ఆరేళ్ళ తరవాత సత్యం సుందరంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీలో కార్తీ నటన ఎలా ఉందో, అరవింద్ స్వామి పాత్ర ఏంటో? తెలుగు ప్రేక్షకులని సత్యం సుందరం మెప్పించిందో లేదో ఈ రివ్యూ లో చూద్దాం.
కథ :
సత్యమూర్తి అలియాస్ సత్యం (అరవింద్ స్వామి)ది గుంటూరు దగ్గరున్న ఉద్దండరాయుని పాలెం. అతనికి ఆ ఊరన్నా, వంశ పారంపర్యంగా వస్తున్నఇల్లన్నా చాలా ఇష్టం. బంధువులు చేసిన మోసం వల్ల సత్యం టీనేజ్ లో ఉన్నప్పుడే ఆ ఇల్లు కోల్పోతారు. దీంతో ఆ ఊరుని వదిలి వైజాగ్ లో స్థిరపడతారు. 30ఏళ్లు గడిచినా సత్యం ఇంకా ఊరు, ఆ ఊరిలో ఉన్న తాతల కాలం నాటి ఇల్లు తల్చుకుని బాధపడుతూ ఉంటాడు. అనుకోకుండా తన బాబాయ్ కూతురు భువన (స్వాతి కొండె) పెళ్లి కోసం సత్యం తన సొంతూరు ఉద్దండరాయుని పాలెంకి వెళ్తాడు. అక్కడే బావా అని అభిమానంగా పలకరిస్తూ ఓ బంధువు (కార్తి) పరిచయం అవుతాడు. అతనెవరు, ఏంటి అనేది సత్యానికి గుర్తు లేకపోయినా బాగుండదని మొహమాటంతో పరిచయమున్నట్లు నటిస్తూ ఉంటాడు. మొదట్లో కార్తీ వాగుడు, అతి చనువు చూసి సత్యం విసుక్కున్నా తరవాత తరవాత అతను చూపే ఆప్యాయత, అనురాగానికి సత్యం ఆకర్షితుడవుతాడు. తిరిగి సిటీ కి వెళ్లిపోయిన సత్యం మళ్ళీ తనని బావా అని పిలిచే వ్యక్తి కోసం సొంతూరు వెళ్తాడు. వీళ్లిద్దరి పరిచయం ఎటు వైపు దారి తీసింది? చివరికి ఏం జరిగింది? అతని జీవితంలో సత్యమూర్తి వల్ల వచ్చిన మార్పులు ఏమిటి? సత్యం తనని తాను ఎలా తెలుసుకున్నాడు? బావా అని పిలుస్తున్న ఆ వ్యక్తితో అతనికున్న బంధం ఏంటి? ఆఖరికి అతని పేరు సత్యంకు గుర్తొచ్చిందా?లేదా? అన్నది మిగతా కథ.
విశ్లేషణ:
దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ కథని ముందు ఒక నవలగా రాసుకున్నారట. తరవాత కార్తీతో సినిమా చేయాలని పంతం పట్టి, పక్కన పెట్టేసిన స్క్రిప్ట్ ని మళ్ళీ కార్తీ ప్రోద్బలంతోనే పూర్తి చేసి సినిమాగా రూపొందించారు. ఒక నవలగా రాసుకున్న కథని సినిమాగా తెరకెక్కించటంలో దర్శకుడు హండ్రడ్ పర్శంట్ విజయం సాధించారు. సినిమా మొదలైన కాసేపటికే మనం కథలో లీనం అయిపోతాం. ప్రతి ఒక్కరూ ఆ పల్లెటూరి వాతావరణానికి కనక్ట్ అయిపోతారు. కథ కొత్తది కాకపోయినా, ఫ్రెష్ ఫీల్ తెప్పించాడు దర్శకుడు,నటులు. ఆస్తి గొడవలతో ఊరు వదలి వెళ్ళిపోవటం , ఎప్పుడో ఊరికి రావటం మామూలే. కానీ తనకే ఎవరో తెలియని వ్యక్తి తనపై అత్యంత ప్రేమ చూపిస్తూ, తన వెన్నంటే తిరుగుతూ ఉంటే, ఎవరో గుర్తుకు రాక, అతను తనకి ఏమవుతాడో తెలియక ఒక వ్యక్తి పడే మానసిక సంఘర్షణ ఈ కథలో కొత్తగా ఉంది. చదివేటట్టు రాసుకున్న కథకి చాలా సౌలభ్యాలుంటాయి. కానీ స్క్రీన్ మీద చూపించేసరికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్నిటిని ప్రేమ్ కుమార్అధిగమించేశారు. కార్తీని ఈ కథకి ఎంచుకోవటంలోనే దర్శకుడు సగం విజయం సాధించాడు. అరవింద్, కార్తిలు కూడా పూర్తి సహకారం అందించారు. తన జీవితంలో 30 ఏళ్ళ క్రితం జరిగిన ఇన్సిడెంట్ కారణంగా అయినవాళ్లు అంటేనే మోసగాళ్లు అని ఫిక్స్ అయి, అందరికీ దూరంగా ఉంటూ, కేవలం తన కుటుంబాన్ని మాత్రమే నమ్మే ఒక వ్యక్తి చివరికి ఎలా మారాడు, ఆ మార్పుకి కారణం అయిన కార్తీ పాత్ర అద్భుతంగా ఉంది. అందరూ ఒకేలా ఉండరని, ఎలాంటి సహాయం ఆశించకుండా అందరూ ఆనందంగా ఉండాలని కోరుకునే వ్యక్తులు కూడా ఉంటారని సత్య తెలుసుకునేలా చేసిన ప్రయత్నమే సత్యం సుందరం. నిడివి ఎక్కువ అయినా కార్తీ నటనతో ఆ లోటు భర్తీ చేసాడు. కావాల్సిన ఎంటర్ టైన్ మెంట్ ఇస్తూనే, రిలేషన్స్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి అన్న భావోద్వేగాల్ని బాగా పండించారు. బావా బావమరుదుల మధ్య వచ్చే సీన్స్ కామెడీగా ఉన్నాయి. ఫస్ట్ టైం ఒక తమిళ సినిమా అరవగోల అని అనిపించకుండా తెలుగు ఆడియన్స్ ని మెప్పించింది. రాకేందు మౌళి రాసిన సంభాషణలు కూడా ఒక తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగ్ ఇస్తుంది. కమర్షియల్ లెక్కలు లేని ప్రేక్షుకుడు మెచ్చే కథ.
సినిమా ఆద్యంతం అరవింద్ స్వామి పాత్రను నడిపించి తీరు సూపర్ గా ఉంది. సత్యం పాత్ర చుట్టు రాసుకున్న కథ అనుక్షణం భావోద్వేగానికి గురి చేసేలా ఉంది. ప్రతీ సీన్ హార్ట్ టచింగ్ అని చెప్పొచ్చు. ఫస్టాఫ్ లో క్యారెక్టర్ల ఎస్టాబ్లిష్‌మెంట్ చేస్తూ ఎమోషన్స్ పండిస్తూ కథను నడిపించారు, సెకండాఫ్‌లో సత్యం, బావా అని పిలుస్తూ వెంట పడే కార్తీ మధ్య ఎమోషనల్ జర్నీ ఫన్ తో పాటు ఎమోషన్స్ ని క్యారీ చేస్తుంది. లాస్ట్ వరకు కథలో ఉండే ఎమోషనల్ సస్పెన్స్‌కు భావోద్వేగాలతో ఫీల్‌గుడ్‌గా ముగించారు. ప్రతీ చిన్న పాత్రని ఎలివేట్ చేసారు. ప్రేమ్ కుమార్ స్క్రిప్టు వర్క్ ఈ సినిమాకి బలం. కమర్షియల్ హంగులతో వస్తున్న సినిమాల మధ్య ఎలాంటి ట్విస్టులు ఆర్భాటాలు లేకుండా కథ, కథనాలే బలంగా రూపొందించిన చిత్రం సత్యం సుందరం. ప్రతీ సీన్‌లో గుండె బరువెక్కే ఎమోషన్స్, కంటతడి పెట్టించే సీన్లు ఈ సినిమాని క్లాసిక్‌గా మార్చాయి.
నటీ నటులు:
కార్తీ మొదటినుంచి డిఫరెంట్ కథలతో ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. ఇప్పడు కూడా ఇలాంటి కథని కార్తీ చేసేందుకు ఒప్పుకొవటం గ్రేట్ అని చెప్పాలి. అతని అభిరుచి ఈ కథని ఎంచుకోవటంలోనే తెలుస్తోంది. కార్తీ నటన అద్భుతంగా ఉంది. వినోదాన్ని పంచుతూ, ఆలోచింప జేసేలా చేసే పాత్రలో కార్తీ చాలా ఈజ్ కనపరిచాడు. కార్తీ కెరియర్ లోనే గుర్తుండిపోయే పాత్ర ఇది. అరవింద్ స్వామి కూడా ఈ పాత్ర చేయటానికి ముందుకు వచ్చినందుకు అప్రిసియేట్ చేయాల్సిందే. ఎలాంటి కమర్షియల్ హంగులూ లేని కథకి వీరిద్దరూ ప్రాణం పోశారు. ప్రేక్షుకుల మనసులు మెప్పించారు. క్లైమాక్స్ ఎపిసోడ్ లో అరవింద్ స్వామి నటన ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకేలా ఉంటుంది. మిగిలిన పాత్రలు తమ పరిధి మేరకు నటించాయి. పాత్రల నటన వలన ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ రాకుండా, మన ఎదురుగా జరుగుతున్న కథలా అనిపించింది.
టెక్నికల్ :
ఈ సినిమాకి దర్శకుడు కూడా ఒక హీరో. ఒక నవలను ప్రేక్షుకుడు మెచ్చేలా సినిమా తీసి మెప్పించారు. డబ్బింగ్ సినిమా అన్న ఫీల్ రాకుండా చేసారు ప్రేమ్ కుమార్. స్లో నేరేషన్ అనిపంచినా కథలో లీనం అయ్యేలా చేసారు. తాను రాసుకున్న కథకి జీవం పోసేలా పాత్రలను ఎంపిక చేసుకున్న తీరు బాగుంది. కార్తీ, అరవింద్ స్వామి లాంటి హీరోలను ఎంచుకోవటం తోనే సగం విజయం సాదించేసారు ప్రేమ్ కుమార్. గోవింద్ వసంత సంగీతం కూడా కథకు అదనపు ఆకర్షణ ఇచ్చింది. పాటలు వినసొంపుగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ లో సినిమా మొత్తం వచ్చే పాట కథకి మరింత దోహదపడింది. విజువల్స్ సూపర్ గా ఉన్నాయి. మహేంద్రన్ జయరాజు సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. గ్రామీణ వాతావరణాన్నీ సూపర్ గా క్రియేట్ చేసారు. 90ల నాటి వాతావరణం చక్కగా రీక్రియెట్ చేసారు. గోవింద్ రాజ్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
కార్తీ, అరవింద్ స్వామి
కథ , కథనం
సంగీతం
దర్శకుడు
మైనస్ పాయింట్స్
కార్తీ డబ్బింగ్
స్లో నేరేషన్ k
నిడివి
ఫైనల్ వర్దిక్ట్: భావోద్వేగాల సమ్మేళనం 'సత్యం సుందరం'..