యుగానికి ఒక్కడు, ఆవారా లాంటి సినిమాలతో తెలుగులో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు కార్తి. తన కథల ఎంపిక, నటన ఇవన్నీ తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. అందుకే తమ మనసుల్లో స్థానం ఇచ్చేశారు. అయితే కార్తికి ఈమధ్య అస్సలు కలసి రాలేదు. చేసిన సినిమాలన్నీ ఫ్లాపే. ఖాకీ మినహా - గత రెండు మూడేళ్లలో కార్తి ఒక్క హిట్టు కూడా కొట్టలేదు. తెలుగులో కార్తి సినిమా కొన్న నిర్మాతలు భారీ నష్టాలు చవి చూశారు.
ఈ పరిస్థితి ఎక్కడి వరకూ వెళ్లిందంటే.. `ఖైదీ` సినిమాని కొనడానికి ఎవ్వరూ ఉత్సాహం చూపించలేదు. అందుకే ఆ సినిమాని చాలా తక్కువ రేటుకి అంటే రూ.3.5 కోట్లకు అమ్మేశారు. అయితే ఇప్పుడు అంతకు రెండింతలు లాభం తెచ్చి పెట్టిందీ సినిమా. దాంతో కార్తికి మళ్లీ తెలుగులో మార్కెట్ బలపడినట్టైంది. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కలిపి ఈ సినిమాకి 7.5 కోట్లు వచ్చాయి. అంటే... కొన్న రేటుకంటే డబుల్ అన్నమాట. తొలి రోజు యావరేజ్ వసూళ్లే అందుకుంది. అయితే ఆ తరవాత వసూళ్లు బాగా పెరిగాయి.
విజయ్ `విజిల్` ధాటికి తట్టుకుంటూ వసూళ్లని ఆర్జించింది. నైజాంలో 2 కోట్లు, సీడెడ్‌లో 90 లక్షలు, ఉత్తరాంధ్రలో 1.25 కోట్లు వచ్చాయి. ఏరియాల వారిగా చూసుకున్నా, మొత్తంగా చూసుకున్నా, కార్తీ కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ హిట్.