శింబు - త్రిష.. వెండి తెరపై హిట్ జోడీ. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన తమిళ వెర్షన్ `ఏం మాయ చేశావె`లో వీళ్లే హీరో హీరోయిన్లు. కార్తీక్ - సేతా పాత్రల్లో వీరిద్దరూ ఇమిడిపోయారు. ఆ కెమిస్ట్రీ ఫ్యాన్స్కి భలే నచ్చింది. ఇప్పుడు గౌతమ్ మరోసారి వీరిద్దర్నీ జంటగా కలిపేశాడు. సినిమా కోసం కాదు, షార్ట్ ఫిల్మ్ కోసం. ఓ రకంగా దీన్ని ఏం మాయ చేశావే షార్ట్ ఫిల్మ్ వెర్షన్ అనుకోవొచ్చు. కార్తీక్, సేతాయెన్... లాక్ డౌన్ వల్ల విడిపోయి, వేర్వేరు ప్రదేశాల్లో ఉండి, ఫోన్లో మాట్లాడుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచనతో `కార్తీక్ డయిల్ సేతాయన్` అనే షార్ట్ ఫిల్మ్ తీశాడు గౌతమ్ మీనన్. ఇందులో శింబు, త్రిష మాత్రమే కనిపిస్తారు. ఎవరి ఇళ్లలో వాళ్లు ఉంటూ షూట్ చేసిన షార్ట్ ఫిల్మ్ ఇది. దీనికి రెహమాన్ నేపథ్య సంగీతం అందించడం విశేషం. నిజానికి చాలా మంచి ఐడియా ఇది.
అభిమానులకు ఓ సినిమా చూసిన అనుభూతిని షార్ట్ ఫిల్మ్లోనే కలిగించాడు గౌతమ్ మీనన్. దీనికి తెలుగు వెర్షన్కూడా వస్తుందేమో చూడాలి. అలా తీస్తే... తెలుగులో చైతూ, సమంత కలిసి నటిస్తే, ఇంకాస్త బాగుంటుంది. చూద్దాం.. ఏమవుతుందో?