ఈరోజు ఉదయం చిరంజీవి నివాసంలో చిత్రసీమకు సంబంధించిన కీలక భేటీ జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రపీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తో పాటు చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, త్రివిక్రమ్, సురేష్ బాబు, సి.కల్యాణ్ తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. షూటింగులకు, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతి ఇవ్వాలని, థియేటర్ల కరెంటు బకాయిలపై సానుకూలంగా స్పందించాలని చిత్రసీమ.. మంత్రిని కోరింది.
ఈ విషయంలో ముఖ్యమంత్రితో కలసి మాట్లాడతానని మంత్రి హామీ ఇచ్చారు. అంతేకాదు.. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎలాంటి అభ్యంతరం లేదని, షూటింగుల కోసమైతే మరి కొన్ని రోజులు ఆగాలని మంత్రి సూచించారు. ఈ నెలాఖరు వరకూ తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగనుంది. ఆ తరవాత షూటింగులకు అనుమతి ఇవ్వొచ్చు. జూన్ 1 నుంచి షూటింగులు మొదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక సినీ కార్మికులు, నిర్మాతల కష్టాలు గట్టెక్కినట్టే.