నిఖిల్ నటించిన కార్తికేయ 2 ఈ శనివారం వస్తోంది. ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ బాగా ఆకట్టుకుంటోంది. ఆ ట్రైలర్ చూశాక సినిమా చూడాలన్న ఆసక్తి మరింత పెరిగింది. అయితే కొంతమంది మాత్రం ఈ సినిమాని `దేవీపుత్రుడు`తో పోలుస్తున్నారు. వెంకటేష్ - కోడి రామకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన `దేవీ పుత్రుడు` గుర్తుంది కదా? ఆ సినిమాకీ `కార్తికేయ 2`కి లింకు పెడుతున్నారు. దానికీ ఓ కారణం ఉంది. ఇవి రెండూ ద్వారకతో ముడి పడి ఉన్న కథలే.
దేవీ పుత్రుడు కథలో శ్రీకృష్ణుడి జన్మస్థానం అయిన ద్వారక ఓ కీలక పాత్ర పోషించింది. ద్వారక చుట్టూ అల్లిన కథ.. దేవీ పుత్రుడు. ఆ కథలోనూ మిస్టరీ చాలా ఉంటుంది. ఫాంటసీ అంశాల్ని మేళవించారు. గ్రాఫిక్స్ కి కీలకమైన పాత్ర ఉంది. ఇప్పుడు `కార్తికేయ 2` కూడా అంతే. ఇది కూడా ద్వారక చుట్టూ తిరిగే కథ. శ్రీకృష్ణుడు కథలో అంతర్లీనంగా వస్తూ పోతూ ఉంటాడు. ఈ విషయాన్ని చిత్రబృందమే చెప్పింది. అందుకే కార్తికేయ 2కి... దేవీ పుత్రుడు 2 అంటూ కామెంట్లు చేస్తున్నారు.
వీటిపై దర్శకుడు చందూ మొండేటి క్లారిఫై ఇచ్చారు. `దేవీ పుత్రుడు` సినిమాతో... తమ కథకు అస్సలు సంబంధమే లేదని తేల్చేశారు. ''దేవీ పుత్రుడు సినిమాతో కార్తికేయని పోలుస్తున్నారు. కానీ అందులో నిజం లేదు. మా కథ పూర్తిగా కొత్తది. కృష్ణుడు అనేది ఓ పాయింట్ మాత్రమే. ఈ కథలో చాలా మిస్టరీ ఉంది'' అని చెప్పుకొచ్చారు.