టాలీవుడ్‌లో లేడీ మ్యూజిక్ డైరెక్టర్ అంటే గుర్తొచ్చేది ఎం.ఎం.శ్రీలేఖ. కీరవాణి సోదరిగా సంగీతాన్ని పుణికి పుచ్చుకుంది శ్రీలేఖ. సింగర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, మ్యూజిక్ డైరెక్టర్‌గా తన సత్తా చాటుతోంది. టాలీవుడ్‌లో లేడీ డైరెక్టర్స్ తక్కువే. లేడీ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా చాలా తక్కువే. అయితే ఇప్పుడు మరో లేడీ మ్యూజిక్ డైరెక్టర్ రంగంలోకి దిగనుంది.
ఆమె ఎవరో కాదు ఇంతవరకూ సింగర్‌గా పలు చిత్రాల్లో తన కోకిల గొంతును వినిపించిన కౌసల్య. ఈమె చాలా కాలంగా తెలుగు చిత్రాలకు పాటలు పాడుతోంది. ఎన్నో సక్సెస్‌ఫుల్ సాంగ్స్ కౌసల్య గొంతు నుండి జాలువారాయి. మ్యూజిక్ ప్రియులను ఓలలాడించాయి. తాజాగా ఓ సినిమాతో ఈ స్వీట్ సింగర్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్‌గా మారబోతోంది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'వాళ్లమ్మాయి' సినిమాకి కౌసల్య మ్యూజిక్ అందిస్తోంది. పలు చిత్రాల్లో బాల నటుడిగా నటించిన నిఖిల్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రవీణ్ సిద్ధాంత్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఇంతవరకూ సింగర్‌గా తన గాత్రంతో ఆకట్టుకున్న కౌసల్య ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా మారుతున్నందుకు చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.
గతంలో మ్యూజిక్ డైరెక్టర్ చక్రి దర్శకత్వంలో ఎన్నో గీతాలను ఆలపించింది కౌసల్య. చక్రి - కౌసల్య కాంబినేషన్‌లో ఎన్నో సక్సెస్‌ఫుల్ ఆడియోస్ రూపుదిద్దుకున్నాయి. పాటను పాటగా ఆలపించడమే కాకుండా కొన్ని చమక్కులు, చురుక్కులతో పాటకి మరింత గ్లామర్ అద్దడం కౌసల్య ప్రత్యేకత. అలాంటి టాలెంటెడ్ సింగర్ కౌసల్య మ్యూజిక్ సారధ్యంలో ఇంకా ఎన్నో వినసొంపైన గీతాలు రావాలని ఆశిద్దాం.