గతవారం బిగ్ బాస్ హౌస్ లో బాబు గోగినేని లోని ఇంతకు ముందెన్నడూ చూడని కోణాన్ని చూసేసరికి బిగ్ బాస్ వీక్షకులతో పాటుగా బిగ్ బాస్ ఇంటి సభ్యులు కూడా షాక్ కి గురయ్యారు.
అయితే ప్రముఖంగా బాబు గోగినేని-కౌశల్ మధ్య జరిగిన గొడవ గురించే పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో నాని కూడా అసలు బాబు గోగినేని ఇలా ఒక్కసారిగా తనలోని కోపాన్ని ప్రదర్శించడానికి కారణం ఏంటి అని ప్రశ్నించగా- కౌశల్ తన వ్యక్తిగత విషయాల పైన కామెంట్ చేశాడు అని మరి ముఖ్యంగా తన ఇంటి సభ్యులనే ప్రభావితం చేయలేని వాడు బయట సమాజాన్ని మార్చాలనుకోవడం ఏంటి అని కౌశల్ చేసిన కామెంట్ కి ఆయన తీవ్రంగా కలత చెందినట్టుగా చెప్పాడు.
అలాగే కౌశల్ తన వ్యక్తిగత విషయాలు తనకి చెబుతూ తన సలహాలు అడుగుతూ మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటి అని నాని ముందు బాబు గోగినేని తన మనసులో ఉన్న మాటని బయటపెట్టాడు. అందుకే కౌశల్ ఈ ఇంటిలో ఉండడానికి పనికిరాడు అని అన్నాను అని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
ఇదే సమయంలో అసలు బాబు గోగినేనిని ఎలిమినేషన్ కి నామినేట్ చేస్తూ సరైన కారణం కౌశల్ చెప్పనందుకు మరోసారి ఇలాంటి అర్ధంలేని కారణాలతో హౌస్ లో ఎలిమినేషన్ కి నామినేట్ చేయొద్దు అంటూ ఒకరకమైన హెచ్చరిక జారీ చేశాడు నాని.
దీనితో అసలు వీరి మధ్యలో గొడవకి కారణం ఇద్దరి మధ్య జరిగిన పర్సనల్ కామెంట్ అని తెలిసిపోయింది.