బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ 2 ఎప్పుడో ముగిసిపోయింది. ఆ షో విన్నర్ కౌశల్, ఇప్పుడో పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. 113 రోజులపాటు సాగిన రియాల్టీ షోని, జస్ట్ ఓ గేమ్ షోగా మాత్రమే చూస్తే సమస్య పెద్దగా ఏమీ వుండదు.
ఫస్ట్ సీజన్‌లో, కంటెస్టెంట్స్ అంతా ఆ షోని, జస్ట్ 'షో'లానే చూశారు. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరు. కౌశల్‌ని మిగతా హౌస్ మేట్స్ అంతా టార్గెట్ చేయడం, ఈ నేపథ్యంలో కౌశల్, తన 'జెన్యూనిటీని' చూపించేందుకు ప్రయత్నించడం.. ఇలా నడిచింది వ్యవహారం. ఎలా పుట్టిందో తెలియదుగానీ, కౌశల్ ఆర్మీ ఆవిర్భావంతో బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ 2 రూపం మారిపోయింది. అక్కడ ఏం జరిగినా, ఇక్కడ సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ సందడి చేసేది. కౌశల్ వ్యతిరేకులపై దుమ్మెత్తి పోసేసేది.
ఇదంతా 'షో' పూర్తయ్యేవరకేనని అంతా అనుకున్నారు. కానీ, షో ముగిసిపోయాక కూడా కౌశల్ ఆర్మీ ఊరుకోవడంలేదు. కౌశల్, సెలబ్రిటీ అయిపోయాడు గనుక.. ఇంటర్వ్యూలు, షోరూంల ప్రారంభోత్సవాలు.. ఇలా అతని హంగామా కన్పిస్తూనే వుంది. టాప్ ఫైవ్‌లో నిలిచిన కంటెస్టెంట్స్ ఎవరో ఒకరు మీడియా ముందుకు వస్తున్నారు. అలా వచ్చేవారంతా, 'అదొక షో.. అంతకు మించి, దాని గురించి మాట్లాడటానికేమీ లేదు..' అనేస్తే, అసలు గొడవే లేదు. అడుగుతున్నారు కాబట్టి, సమాధానం చెబుతున్నామన్న ధోరణిలో.. సరికొత్త వివాదాలకు ఆస్కారమిస్తున్నారు.
తనీష్ - కౌషల్ మధ్య 'బయటకి వచ్చాక నీ సంగతి చూస్తా' అనే సవాల్ నేపథ్యంలో, దాన్ని కౌశల్ ఆర్మీ హైలైట్ చేస్తోంది. రియల్ లైఫ్‌లో అలాంటివి ఎవరైనా చేస్తే, చట్టపరమైన చర్యలుంటాయన్నది అందరికీ తెల్సిన విషయమే. గీత కావొచ్చు, సామ్రాట్ కావొచ్చు, కౌశల్ కావొచ్చు.. ముగిసిన షో గురించి, వెటకారాలు చేయడం, వివాదాన్ని కొనసాగించడం.. వారి వ్యక్తిత్వాన్ని పలన చేస్తుందని గుర్తెరిగితే మంచిది.