రామోజీ ఫిల్మ్ సిటీలో జరగాల్సిన `బ్రహ్మాస్త్రం` ప్రీ రిలీజ్ ఫంక్షన్ చివరి నిమిషాల్లో కాన్సిల్ అయ్యింది. దాంతో... హడావుడిగా పార్క్ హయత్ లో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాల్సివచ్చింది. ఆర్.ఎఫ్.సీలో ఇది వరకు `సాహో`, `రాధేశ్యామ్` లాంటి సినిమాల ప్రీ రిలీజ్ వేడుకలు జరిగాయి. అయితే... అక్కడ నిర్వహణా లోపాలు ఉన్నాయని, అందుకే అనుమతి ఇవ్వమని పోలీసులు చెప్పారు.
కానీ పోలీసులు ఈ వేడుకకు అనుమతి ఇవ్వకపోవడం వెనుక కేసీఆర్ ఉన్నారన్నది ఫిల్మ్ నగర్ వర్గాల మాట. ఇటీవల ఎన్టీఆర్ తో అమీత్ షా భేటీ వేసిన సంగతి తెలిసిందే. ఈ మీటింగ్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఎన్టీఆర్ బీజేపీతో దోస్తీ కడతారని వార్తలు పుట్టాయి. కేటీఆర్‌కీ బీజేపీకి అస్సలు పడడం లేదు. శత్రువుకు మిత్రుడు శత్రువే... అనే పాలసీతో ఇప్పుడు ఎన్టీఆర్ పై కేసీఆర్ కక్ష కట్టారని, అందుకే ఈ మీటింగ్ కి అనుమతులు నిరాకరించారని చెప్పుకొంటున్నారు. అయితే.. ఎన్టీఆర్ ని, ఎన్టీఆర్ తో అమీత్ షా మీటింగునీ కేసీఆర్ లాంటి వ్యక్తి అస్సలు ప్రాధాన్యం ఇవ్వరని, పైగా ఇది ఎన్టీఆర్ సినిమా కాదని, అలాంటప్పుడు కేసీఆర్ కక్ష సాధింపు చర్యలకు దిగడం వల్ల ప్రయోజనం ఉండదని కేసీఆర్ వర్గీయులు అంటున్నారు. ఏది ఏమైనా బ్రహ్మాస్త్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి అనుమతులు రాకపోవడం ఇప్పుడు మరో ఆసక్తికరమైన చర్చకు దారి తీసినట్టైంది.