'చంద్రబాబు నాయుడుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. ఆంధ్రా రాజకీయాలలో జోక్యం చేసుకుంటా' అనేది కే సీ ఆర్ తాజా స్టేట్‌మెంట్. ఈ కామెంట్ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై ఇప్పుడు తీవ్ర ప్రభావం చూపిస్తుందనడంలో సందేహం లేదు. రాబోయే ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో కేసీఆర్ ఓ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయనున్నారన్న సంకేతాలు అందేశాయి. అది పవన్ కల్యాణ్ 'జనసేన'కే అన్నది.. పవన్ అభిమానుల ఆశ, నమ్మకం. టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ జనసేనకే అని, దాన్ని దృష్టిలో ఉంచుకునే కేసీఆర్ ఈ కామెంట్ చేశారన్న మాటలు వినిపిస్తున్నాయి.
పవన్ అభిమానుల నమ్మకాన్ని పూర్తిగా కొట్టి పారేయలేం. ఎందుకంటే... ఆంధ్ర ప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి గట్టి పోటీ ఇస్తోంది.. జనసేననే. నేరుగా టీడీపీ నేతల్ని మరీ ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్‌లని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నాడు పవన్. అందుకే చంద్రబాబుని గద్దె దించాలంటే పవన్‌కి చేయూత ఇవ్వడమే ఉత్తమ మార్గం అని కేసీఆర్ భావించి ఉండొచ్చు.
దానికి తోడు కేటీఆర్ - పవన్ లమధ్య మంచి సంబంధాలు నెలకొన్నాయి. అది కూడా పవన్ అభిమానుల నమ్మకానికి ఊతం ఇస్తోంది. తెలంగాణలో కేసీఆర్ గెలవగానే.. ఆంధ్రాలో పవన్ అభిమానులు సైతం సంబరాలు చేసుకోవడం మొదలెట్టారు. కేసీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి శుభాకాంక్షలు అందజేస్తున్నారు. దాన్ని బట్టి.. ఈ మైత్రీ బంధం చిగురులు తొడగబోతోందని చెప్పడానికి అవే సాక్ష్యాలు.