సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ట్విట్టర్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్లో కొంతమంది బుర్రలేని దర్శకులతో పనిచేయాల్సివచ్చిందని.. వేటూరి మరణం, సిరివెన్నెల అనారోగ్యం కారణంగా తెలుగు సినీ సాహిత్యం పడకేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కీరవాణి వ్యాఖ్యల్ని చూస్తే ఆయన రిటైర్‌మెంట్ మూడ్‌లో ఉన్నట్టు అర్థమవుతోంది. రెండేళ్ల క్రితం 'త్వరలో స్వచ్ఛందంగా సినిమాల నుంచి నిష్క్రమిస్తా' అని ప్రకటించారాయన. బాహుబలి 2 ఆయన ఆఖరి సినిమా కొవొచ్చు. ఈ విషయంపై ఈ రోజు బాహుబలి ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన ఓ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలున్నాయి. తన రిటైర్‌మెంట్ గురించి వ్యాఖ్యానించినప్పుడు మిశ్రమ స్పందన వచ్చిందని, కొందమంది ఇదే మంచి తరుణం అన్నారని, ఇంకొంతమంది ఇంకొన్ని సినిమాలకు పని చేయమని సలహా ఇచ్చారని, సంగీత దర్శకుడు తమన్ తన రిటైర్‌మెంట్ గురించి వాకబు చేశాడని, తన రిటైర్‌మెంట్ గురించి ఆత్రుత ప్రదర్శిస్తున్నాడని, తాను రిటైర్ అయితే తన సహాయకుడు జీవన్‌ని లాక్కోవాలని చూస్తున్నాడని కీరవాణి వ్యాఖ్యానించడం విశేషం. కీరవాణి ట్వీట్లు ప్రస్తుతం సంచలనం రేకెత్తిస్తున్నాయి.