ఇది వెబ్ సిరీస్‌ల కాలం. ఓటీటీల హవా బాగా నడుస్తోంది. స్టార్లంతా ఓటీటీల వైపు పరుగులు తీస్తున్నారు. అక్కడి నుంచి భారీ పారితోషికాలూ అందుతున్నాయి. తమన్నా, సమంత, శ్రుతిహాసన్, త్రిష... వీళ్లంతా ఓటీటీల్లో మెరవడానికి రెడీ అయినవాళ్లే. ఇప్పుడు ఈ జాబితాలో కీర్తి సురేష్ కూడా చేరబోతోంది. కీర్తికి ఓటీటీలో నటించడానికి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయట. ఈ విషయాన్ని కీర్తినే చెప్పింది.
''ఓటీటీలు రూపొందించే వెబ్ సిరీస్‌లో నటించమని ఆఫర్లు వస్తున్న మాట వాస్తవమే. అయితే... మంచి కథ, కథనాలు దొరికితేనే ఓటీటీలో నటిస్తా. ఇప్పుడు ఓటీటీకీ, థియేటర్ కీ మధ్య తేడా చిన్నదైపోయింది. ఎక్కడైనా సరే.. మంచి కథకే ప్రాధాన్యం. నన్ను టెమ్ట్ చేసే కథలొస్తే.. తప్పకుండా ఓటీటీలో కనిపిస్తా. ఇప్పటి వరకైతే అలాంటి కథ ఎవరూ చెప్పలేదు'' అంది. కీర్తి సురేష్ నటించిన `మిస్ ఇండియా`. బుధవారం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానున్న సంగతి తెలిసిందే.