యువ హీరో నితిన్ చాలా ప్రాజెక్టులు లైన్లో పెట్టాడు. 'రంగ్ దే' షూటింగ్ దశలో ఉండగా 'అంధా ధున్' రీమేక్, చంద్రశేఖర్ యేలేటి ఫిలిం, కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కనున్న 'పవర్ పేట' లైన్లో ఉన్నాయి. వీటిలో 'పవర్ పేట' చిత్రానికి ప్రస్తుతం జోరుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందట.
ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ సినిమాలో నితిన్ మూడు రకాల వయసులలో కనిపిస్తాడట. ఇరవై, నలభై, అరవై ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తిగా కనిపిస్తాడని అంటున్నారు. ఇలా కనిపించేందుకు రియలిస్టిక్ మేకప్ కోసం ఓ హాలీవుడ్ టెక్నిషియన్ ను తీసుకుంటున్నారట. ఇంతే కాకుండా ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను అనుకుంటున్నారట.
వెంకీ అట్లూరి దర్శకత్వం లో నితిన్ నటిస్తున్న 'రంగ్ దే' సినిమాలో హీరోయిన్ కీర్తి. ఈమధ్యే దర్శకుడు కృష్ణ చైతన్య 'రంగ్ దే' రషెస్ చూడడం జరిగిందట. అందులో నితిన్-కీర్తి కెమిస్ట్రీ తనను ఎంతో ఆకట్టుకుందట. అందుకే 'పవర్ పేట' సినిమాలో కూడా కీర్తినే హీరోయిన్ గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. 'పవర్ పేట' ఓ ఇంటెన్స్ స్టోరీతో తెరకెక్కుతుందని ఇందులో హీరో పాత్రతో పాటుగా హీరోయిన్ పాత్ర కూడా నటనా ప్రాధాన్యం ఉన్నదేనని సమాచారం. అందువల్లే కీర్తిని ఫైనలైజ్ చేసుకున్నారని అంటున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కే అవకాశం ఉంది.