ఏ ముహూర్తాన గుడ్ లక్ సఖీ అని పేరు పెట్టారో గానీ, ఆ టైటిల్ కి రివర్స్ లో జరుగుతోంది వ్యవహారం అంతా. కీర్తి సురేష్ కథానాయిక గా నటించిన చిత్రమిది. జగపతిబాబు, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలు. ఈ సినిమా ఎప్పుడో పూర్తయింది. ఎప్పుడో విడుదల కావాల్సింది కూడా. కానీ రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈనెల 31న విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. కానీ ఇప్పటి వరకూ ఎలాంటి అలికిడీ లేదు. మరోసారి ఈ సినిమా వాయిదా పడినట్టు టాక్.
ఇప్పటికే ఈ సినిమాకి ఉన్న క్రేజ్ మొత్తం పోయింది. ఇలా వరుస వాయిదాలతో మరింత శూన్యం అయిపోయింది. కీర్తి లేడీ ఓరియెంట్ సినిమాలన్నీ ఈమధ్య అటకెక్కుతున్నాయి. దాంతో ఈ సినిమా కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఓటీటీలో అమ్ముదామంటే అక్కడ కూడా ఈ సినిమాకి బజ్ లేదు. ఏ ఓటీటీ సంస్థా ఈ సినిమా కొనడానికి ధైర్యం చేయడం లేదు. అందుకే రిలీజ్ డేట్ ప్రకటించి, బజ్ లేకపోవడంతో వాయిదా వేసుకుంటూ వెళ్తున్నారు. డిసెంబరు 31 దాటితే... ఇక ఫిబ్రవరిలోనే విడుదల చేసుకోవాలి. ఈలోగా ఉన్న క్రేజ్ కాస్త హుష్ కాకి అయిపోతుందన్నది నిర్మాతల భయం.