టాలీవుడ్ లో దూసుకెళ్లిపోతోంది కీర్తి సురేష్. కమర్షియల్ కథలూ, లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టులూ.. ఆమె వెనుకే తిరుగుతున్నాయి. తాజాగా... మరో సూపర్ ఛాన్స్ కీర్తి ఖాతాలోకి వెళ్లిపోయినట్టు టాక్. తమిళ సూపర్ స్టార్... విజయ్ కథానాయకుడిగా దిల్ రాజు ఓ సినిమాని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకుడు. ఈ చిత్రంలో కథానాయికగా కీర్తిని ఎంచుకున్నట్టు టాక్. ఇది వరకు `సర్కార్`లో విజయ్ - కీర్తిల జోడీ కనువిందు చేసింది. ఈ సినిమా ఓకే అయితే... హిట్ కాంబినేషన్ రిపీట్ అయినట్టే.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమా ఇది. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటోంది. కీర్తి నటించే తొలి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే అవుతుంది. ఇది వరకే... దిల్ రాజు బ్యానర్‌లో ఓ సినిమా చేయడానికి కీర్తి ఒప్పందం చేసుకుంది. అందుకే కీర్తిని ఈ సినిమాలోకి తీసుకొచ్చేశారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వస్తాయి.