మహానటితో... నిజంగానే టైటిల్ కి న్యాయం చేసే స్థాయిలో నటించింది కీర్తి సురేష్. ఆ సినిమాతో కీర్తికి జాతీయ అవార్డు సైతం దక్కింది. జాతీయ అవార్డుల్లాంటివి నటీనటులపై కొత్త భారాన్ని మోపుతాయి అనడంలో.. కీర్తినే పెద్ద ఉదాహరణ. ఆ తరవాత ఎలాంటి సినిమాలు ఎంచుకోవాలి? అనే విషయంలో తీవ్రంగా ఆలోచించి, లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్టులపై దృష్టి పెట్టింది. పెంగ్విన్, మిస్ ఇండియా లాంటి సినిమాలు ఆమె కెరీర్ ని బాగా ఇబ్బంది పెట్టాయి. దాంతో.. అటు నుంచి కమర్షియల్ సినిమాలవైపు అడుగుపెట్టింది. అందులో భాగంగా వచ్చిన `రంగ్ దే` కూడా తేలిపోయింది.
ఎప్పుడో పూర్తయిన మరో సినిమా `గుడ్ లక్ సఖీ` మాటేంటో ఇప్పటికీ తెలియడం లేదు. చేతిలో `సర్కారు వారి పాట`లాంటి పెద్ద సినిమా ఉన్నా, తన కెరీర్ గందరగోళంలో ఉందన్నది వాస్తవం. పైగా `రంగ్ దే`లో కీర్తి లుక్ దారుణంగా ఉంది. కీర్తి మరీ పీలగా ఉందని, మొహంలో కళే తగ్గిపోయిందని ఆమె ఫ్యాన్స్ కూడా ఫీలయిపోతున్నారు. కీర్తి.. జీరో సైజ్ మోజులో, తన అందాన్ని తగ్గించుకుంటోందని వాపోతున్నారు. ఓ వైపు ఫ్లాపులు, మరోవైపు గ్లామర్ పడిపోవడం.. రెండూ ఇబ్బంది పెట్టేవే. మరి కీర్తి ఎప్పటికి తేరుకుంటుందో ఏమో..?