'ఎన్టీఆర్' బయోపిక్స్ అంటూ మూడు సినిమాలు ఒకే టైంలో వార్తల్లో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. వాటిలో బాలయ్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'మహానాయకుడు' సినిమాల సంగతి ఏమైందో అందరం చూసేశాం. ఆ తర్వాత వర్మ తెరకెక్కించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఎలా విడుదలైందో కూడా చూసేశాం. ఇక ముచ్చటగా మూడో బయోపిక్‌గా వార్తల్లో నిలిచిన 'లక్ష్మీస్ వీరగ్రంధం' కేవలం ఫస్ట్‌లుక్‌కే పరిమితమైంది. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఈ సినిమాని రూపొందించారు. ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఇకపోతే ఈయన దృష్టి ఇప్పుడు జయలలిత బయోపిక్‌పై పడింది.
ఇప్పటికే జయలలిత బయోపిక్‌పై నాలుగు సినిమాలు రెడీగా ఉన్నాయి. అందులో నిత్యామీనన్ లీడ్ రోల్ పోషిస్తున్న ఒకటైతే, కంగనా రనౌత్ నటిస్తున్న ఎ.ఎల్. విజయ్ సినిమా ఇంకోటి. ఈ సినిమా ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభమై శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక్కడి వరకూ మ్యాటర్ క్లియర్. ఇకపోతే మన కేతిరెడ్డిగారి సినిమా విషయానికొస్తే, 'శశి లలిత' అంటూ జయలలిత చరమాంకంలో ఆసుపత్రిలో ఉన్న ఆ 75 రోజుల్లో ఏం జరిగింది.? అనే కథాంశాన్ని ప్రజలకు తెలియని అంశాలతో ప్రధానంగా తెరకెక్కిస్తానని అనౌన్స్ చేశారు.
ఈ బయోపిక్‌లో జయలలిత బాల్యం, సినిమా, రాజకీయం, మరణం.. ఇలా అన్ని విషయాలనూ పొందుపరుస్తానని కూడా ఆయన తెలిపారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జయలలిత ఆత్మ తనతో చెప్పిన నిఖార్సయిన నిజాల్ని ఈ సినిమాలో చూపిస్తానని కేతిరెడ్డి చెప్పారు. అప్పుడు ఎన్టీఆర్ ఆత్మ అన్నారు. ఇప్పుడు జయలలిత ఆత్మ అంటున్నారు. ఈ ఆత్మల గోలేంటో కానీ, కేతిరెడ్డి సినిమాలు ఎప్పుడు ప్రేక్షకుల్లోకి వస్తాయో మాత్రం క్లారిటీ లేదు.