ఎలాంటి అంచనాలూ లేకుండా వచ్చి, బాక్సాఫీసు రికార్డుల్ని కొల్లగొట్టింది కేజీఎఫ్. ఇప్పుడు కేజీఎఫ్ 2పై భారీ ఆశలున్నాయి. వాటిని అందుకోవడానికి ప్రశాంత్ నీల్ చాలా కష్టపడుతున్నాడు. ఈ వేసవిలో కేజీఎఫ్ 2 విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. దాదాపుగా షూటింగ్ పూర్తయ్యింది. ఈసినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఈసినిమా కోసం బాలీవుడ్ క్లాసిక్ గీతం... `మెహబూబా... ఓ మెహబూబా` అనే పాటని రీమిక్స్ చేసినట్టు సమాచారం. అమితాబ్ - ధర్మేంద్ర కలిసి నటించిన షోలేలోని సూపర్ హిట్ గీతమిది. దాన్ని రీమిక్స్ చేస్తే.. ఈ సినిమాకి మరింత పాపులారిటీ వస్తుందని చిత్రబృందం భావించిందని, ఇటీవలే హైదరాబాద్ లో ఈ పాటని తెరకెక్కించారని వార్తలొచ్చాయి.
కేజీఎఫ్ 1లోనూ ఓ ఐటెమ్ గీతం ఉంది. ‘త్రిదేవ్’ చిత్రంలోని జాకీ ష్రాఫ్, సోనమ్ నర్తించిన ‘గలీ గలీ మే’ పాటను రీమిక్స్ చేశారు. ఈ సాంగ్‌లో బుల్లితెర హాట్ బ్యూటీ మౌనీ రాయ్ డ్యాన్స్ చేసి మెప్పించింది. తెలుగులో మాత్రం ‘దోచెయ్’ అంటూ తమన్నాతో ఐటమ్ సాంగ్ చేయించారు. కాబట్టి... ఈ సినిమా కోసం మెహబూబా పాటని రీమిక్స్ చేయడంలో ఆశ్చర్యమేం లేదు. కాకపోతే.. చిత్రబృందమే ఈ విషయాన్ని ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటించలేదు.