KA Movie Review: క మూవీ రివ్యూ & రేటింగ్‌

మరిన్ని వార్తలు

చిత్రం:  క
దర్శకత్వం: సుజీత్‌, సందీప్‌  
కథ - రచన :  సుజీత్‌, సందీప్‌ 


నటీనటులు: కిరణ్ అబ్బవరం,తన్వీ రామ్,నయన్ సారిక, అచ్యుత్‌కుమార్‌,రెడిన్‌ కింగ్‌స్లే  శరణ్య ప్రదీప్,అన్నపూర్ణమ్మ, అజయ్,బిందు చంద్రమౌళి తదితరులు      


నిర్మాతలు: చింత గోపాలకృష్ణ రెడ్డి


సంగీతం:  సామ్ సీ.ఎస్ 
సినిమాటోగ్రఫీ : విశ్వాస్‌ డానియేల్‌,సతీష్ రెడ్డి మాసం
ఎడిటర్:  శ్రీ వరప్రసాద్


బ్యానర్:  శ్రీచక్రాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, క ప్రొడక్షన్స్
విడుదల తేదీ: 31 ఆక్టోబర్ 2024
 


ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.75/5
ఇంగ్లీష్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

కిరణ్ అబ్బవరం 'క'అనే టైటిల్ తోనే ఆసక్తి కలిగిస్తూ ముందునుంచి అంచనాలు పెంచేసాడు. కమర్షియల్ సినిమాలకి దూరంగా ఉంటూ  యూత్ కి బాగా కనక్ట్ అయ్యే కథలు తీసుకోవటంలో  కిరణ్  స్టైల్ వేరు. మన పక్కింటి కుర్రాడిలా కనిపించే కిరణ్ ఎన్ని అవమానాలు,సవాళ్లు ఎదుర్కొన్నా హీరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. పీరియాడిక్ జోనర్ లో సాగే థ్రిల్లర్ సినిమా క. కిరణ్ మొదటి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే కావటం విశేషం. కథ పై ఉన్న నమ్మకంతో పాన్ ఇండియా వైడ్ గా 'క' రిలీజ్ చేస్తున్నారు. కాకపోతే మొదట తెలుగులో రిలీజ్ అవుతోంది. మలయాళం రైట్స్ దుల్కర్ తీసుకున్నాడు. అదే రోజు అతని లక్కీ భాస్కర్ ఉండటంతో కొన్ని రోజుల తరువాత మళయాలంలో క రిలీజ్ అవుతుంది. ఇక తమిళం లో థియేటర్స్ దొరకలేదు. సో ముందుగా తెలుగులో కిరణ్ అదృష్టాన్ని పరీక్షించుకుంటు న్నాడు. దీపావళి సందర్భంగా ఈ రోజు థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది క మూవీ. కిరణ్ కి క ఎలాంటి హిట్ ఇచ్చిందో, పాన్ ఇండియా హిట్ అందుకుంటాడా లేదో ఈ రివ్యూలో చూద్దాం.   

 

కథ :
అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనాథ. తాను అనాథ అయినా తన తల్లి దండ్రులు ఎక్కడో దగ్గర ఉంటారని,ఎప్పటికైనా వారు తిరిగొస్తారన్న ఆశగా ఎదురుచూస్తుంటాడు. ఇతరులకు వచ్చిన ఉత్తరాలు చదువుతూ,వాటిని తన వాళ్లే రాసినట్లు ఊహించుకుంటూ, ఆ ఉత్తరాల్లో తాను పోగొట్టుకున్న బంధాల్ని చూసుకుంటాడు. ఓసారి తన ఉత్తరం దొంగతనంగా చదివాడని మాస్టార్ గురునాథం (బలగం జయరాం) వాసును కొట్టడంతో అతని జేబులో డబ్బులు తీసుకుని ఆశ్రమం నుంచి పారిపోతాడు. అక్కడ నుంచి క్రిష్ణగిరి అనే ఊరు చేరుతాడు వాసు. అక్కడ కాంట్రాక్ట్ పోస్ట్‌మెన్‌గా ఉద్యోగంలో చేరతాడు. ఆ ఊరిలో ఉన్న పోస్ట్‌మాస్టర్ రంగారావు (అచ్యుత్ కుమార్) కూతురు సత్యభామ (నయన సారిక)తో ప్రేమలో పడతాడు. కృష్ణ గిరిలో ఉండే అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు. అందరి ఉత్తరాలు చదివే అలవాటున్న వాసుకి ఓ లెటర్ లో ఈ మిస్సింగ్ కేసులకు సంబంధించిన క్లూ ఒకటి దొరుకుతుంది. అప్పటి నుంచి వాసుదేవ్ జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. వాసుదేవ్‌ను కిడ్నాప్ చేసి చీకటి గదిలో బంధిస్తాడు ఒక ముసుగు వ్యక్తి. అసలు ఆ ముసుగు వ్యక్తి ఎవరు? వాసు హంతకుడని ముసుగు మనిషి ఎందుకు అంటున్నాడు? వాసుదేవ్ పక్క గదిలో ఉన్న రాధ (తన్వీ రామ్) ఎవరు? ఆ ఊరి అమ్మాయిలు మిస్సింగ్  కి కారణం ఏంటి? ఎవరు ? కృష్ణగిరిలోని లాలా, అబిద్ షేక్‌ల పాత్రలేంటి? వీళ్ళతో వాసుకి ఉన్న విరోధం ఏంటి? రాధని ఎందుకు వాసు కాపాడాడు? ముసుగు వ్యక్తి చెర నుంచి వాసు, రాధా ఎలా బయట పడ్డారు. వాసుదేవ్ - సత్యభామల ప్రేమకథ ఏమైంది? అసలు 'క' అంటే ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.  

 

విశ్లేషణ: 
గతం మరిచిపోయిన వాసుదేవ్‌ను బంధించి నిజాలు తెలుసుకొంటున్న అజ్ఞాతవాసి ఎపిసోడ్‌తో సినిమా ప్రారంభమవుతుంది.'క'మూవీ ముఖ్యంగా విమెన్ ట్రాఫికింగ్ అన్న నేపథ్యంలో సాగుతుంది. కథ కొత్తది కాకపోయినా,ఇంట్రెస్టింగ్ గా మలిచిన విధానం బాగుంది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో అద్భుతంగా నడిపించారు సుజిత్, సందీప్. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్,స్క్రీన్ ప్లేతో పాత్రలను పరిచయం చేస్తూ కథ నడిపించిన విధానం సూపర్. ఇంటర్వెల్‌లో అదిరిపోయే ట్విస్ట్‌తో కథను మలుపు తిప్పిన తీరు కూడా బాగుంది. సెకండాఫ్‌లో పూర్తి స్థాయి కథను వివరించిన విధానం,క్లైమాక్స్‌ ఈ సినిమాకి ప్లస్ అని చెప్పొచ్చు. చాలా రోజుల తరువాత ఒక ఫీల్‌గుడ్‌ మూవీ చూశామన్న సంతృప్తి కలుగుతుంది. ట్రైలర్ రిలీజ్ అప్పుడు దర్శకుడు సందీప్ మాట్లాడుతూ 'ఐడియాల్లో కొత్త, పాత అనేవి ఉండవని ఎంత కొత్తగా ప్రజెంట్ చేశామన్నది ముఖ్యమని చెప్పాడు. సినిమా చూస్తే అతని మాటలు నిజమే అనిపిస్తాయి. పాత ఐడియాని కొత్తగా ప్రజంట్ చేసిన విధానం బాగుంది. 1980 నేపథ్యంలో కథ. ఆ పీరియాడిక్ టచ్ లో కథ చెప్పటం వలన కథకి ఫ్రెష్ నెస్ వచ్చింది.  


'క'లో ఉమెన్ ట్రాఫికింగ్ మెయిన్ టాపిక్ అయినా  అది రివీల్  అయ్యే వరకు కథను నడిపించిన విధానం బాగుంది. దర్శకులు సుజిత్ - సందీప్ మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యారు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఆడియన్స్ ని ఎంగేజ్ చేయగలిగారు. కథ ప్రారంభమే ఆసక్తిగా మొదలవుతుంది. చీకటి గదిలో హీరోని ముసుగు మనిషి బంధించడం,ప్రశ్నించటం,కాలచక్రం లాంటి ఆసక్తికర అంశాలు చాలా ఉన్నాయి. రిడిన్ కింగ్ స్లే కామెడీ పండలేదు. రొటీన్ డైలాగ్స్, సాంగ్స్ కథని కొంచెం డిస్ట్రబ్ చేసాయి. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ సినిమాలో లవ్ స్టోరీ అంత ఆసక్తిని  ఇవ్వలేదు. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ పెంచింది. అక్కడ నుంచి చివరి వరకు సస్పెన్స్ మైంటైన్ చేశారు. క్లైమాక్స్ కొత్తగా ఉంది. ప్రేక్షకుడికి ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. ఈ కథను సెట్ చేసిన కృష్ణగిరి ఊరు,అక్కడి  సమస్య,సమస్య పరిష్కరణలో హీరోకి ఎదురయ్యే సవాళ్లు అన్ని ఆడియన్స్ ని  ఆకట్టుకుంటాయి. మనిషి పుట్టుక,కర్మ ఫలం,రుణానుబంధం,ఈ మూడు విషయాల్ని ముడిపెట్టి దర్శకుడు చెప్పిన సందేశం,కథను ముగించిన తీరు బాగుంది.  

 

నటీ నటులు:
కిరణ్ అబ్బవరం ఈ కథకి అసలు సిసలైన హీరో అని నిరూపించాడు. కిరణ్ కెరీర్‌ లో గుర్తుండిపోయే సినిమా ఇది అనటంలో సందేహం లేదు. అభినయ వాసుదేవ్‌గా కిరణ్ నటన చాలా న్యాచురల్ గా ఉంది. యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు ఎమోషన్ సీన్స్ లో కూడా కిరణ్ నటన అద్భుతంగా ఉంది. సినిమాలో కిరణ్ పాత్రలోని మరో కోణం ప్రేక్షకుల్ని సర్ప్రయిజ్ చేస్తుంది. ఈ కథకి కిరణ్ కరక్ట్ గా సెట్ అయ్యాడు. మొదటి నుంచి కిరణ్  ప్రతీ సినిమాలో కొత్తదనం కోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇప్పుడు కూడా కిరణ్ చేసిన ప్రయత్నం ఫలించింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌ను  తీసుకుని తన పాత్ర చుట్టూ కథను అల్లుకొన్న స్టయిల్ సూపర్. ఆ పాత్రకి తగినట్లు కిరణ్ తన రూపాన్ని మార్చుకొన్న తీరు అన్ని సినిమాకు ప్లస్ అయ్యాయి. సెకండాఫ్‌లో కిరణ్ ఫెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. నయన సారిక అందం అభినయంతో ఆకట్టుకుంది. నయన సారిక గ్లామర్ సినిమాకి కలిసి వచ్చింది. తన్వి రామ్‌ కథలో కీలక పాత్రలో కనిపించింది. ఎమోషన్ సీన్స్ ని రక్తి కట్టించింది. అచ్యుత్ కుమార్,శరణ్య ప్రదీప్, అన్నపూర్ణమ్మ,అజయ్,బిందు చంద్రమౌళి తదితరుల తమ పాత్రలు పరిధి మేరకు నటించారు. 

 

టెక్నికల్ :
ఇద్దరు దర్శకులు సుజీత్- సందీప్‌ల కష్టం ఈ సినిమాలో కనిపించింది. ఇద్దరి కో ఆర్డినేషన్ బాగుంది. కాన్సెప్ట్‌,స్క్రీన్‌ప్లే బేస్డ్‌గా కథ మొత్తం సాగింది. అక్కడక్కడా చిన్న మిస్టేక్స్ ఉన్నా క్లైమాక్స్ తో అవన్నీ చెల్లా చెదురైపోతాయి. ఈ మూవీకి ఆయువు పట్టు క్లైమాక్స్. చివరి 20 నిమిషాల్లో దర్శకులగా సందీప్, సుజిత్‌లు తమ మార్క్ చూపించారు.'క'పదానికి ఉన్న అర్థం చెప్పటం బాగుంది. క తో దర్శకులు పూర్తిగా సక్సెస్ అయ్యారు.  80 కాలానికి తగ్గట్లుగా ఆర్ట్ వర్క్ బాగా కుదిరింది. సినిమాకి ఆర్ట్ వర్క్ కూడా ఒక ప్లస్ అయ్యింది. ప్రేక్షకులకు ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది ఆర్ట్ టీమ్.  సామ్ సిఎస్ సంగీతం సినిమాకి ప్రధాన బలం. పాటలు బాగున్నాయి. జాతర పాట మాస్‌ కి బాగా నచ్చుతుంది. యాక్షన్ సీక్వెన్స్‌లో నేపథ్య సంగీతం హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేసింది. విజువల్స్ ఆకట్టుకున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. 

 

ప్లస్ పాయింట్స్ 
కథ, కథనం 
కిరణ్ అబ్బవరం నటన
క్లైమాక్స్ 
ఆర్ట్, సంగీతం  


మైనస్ పాయింట్స్ 
లవ్ ట్రాక్ 
ఫస్ట్ హాఫ్  

 

ఫైనల్ వర్దిక్ట్ : 'క'దిలించే క్లెయిమాక్స్ తో...


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS