కిరణ్ అబ్బవరంకి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. కెరీర్ ప్రారంభంలో ఒకట్రెండు విజయాల్ని సైతం అందుకొన్నాడు. తన బాడీ లాంగ్వేజ్.. డైలాగ్ డెలివరీ.. అన్నీ సహజంగా ఉంటూ ఆకట్టుకొంటాయి. అందుకే ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే.. ఈమధ్య తన సినిమాలు కొన్ని బోల్తా పడ్డాయి. కథల ఎంపిక బాగానే ఉన్నా, మాస్ కి దగ్గరైపోవాలన్న ఆరాటం ఎక్కువ కనిపించింది. మాస్ హీరోలా.. భారీ ఫైట్లు చేయడం, పంచ్ డైలాగులు విసరడం బెడసి కొట్టింది. పక్కింటి అబ్బాయిలా ఉండే కుర్రాడు.. యాక్షన్ హీరో అవతారం ఎత్తేసరికి జీర్ణించుకోలేకపోయారు జనాలు. వాటివల్లే సినిమాలు బోల్తా పడ్డాయి.
ఈ విషయం కిరణ్ అబ్బవరం ఇప్పటికీ గ్రహించలేకపోతున్నాడు. తన నుంచి ఇప్పుడు `మీటర్` అనే సినిమా వస్తోంది. ఇది పూర్తి కమర్షియల్ మీటర్‌లో సాగే సినిమా. ఈ విషయం టీజర్ చూస్తే అర్థమైపోతోంది. అంతే కాదు.... దర్శక నిర్మాతలు కూడా ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం మాస్ హీరో అయిపోతాడంటూ ప్రచారం చేస్తున్నారు. కిరణ్ నుంచి జనాలు మాస్,యాక్షన్ సినిమాలు కోరుకోవడం లేదు,. సరదాగా సాగిపోయే టైమ్ పాస్ కథలు చేస్తే చాలనుకొంటున్నారు. ఇలాంటి దశలో.. కూడా కిరణ్ పూర్తి స్థాయి యాక్షన్ సినిమాల్ని ఎంచుకొంటున్నాడెందుకో అర్థం కావడం లేదు. మీటర్ సినిమా క్లిక్ అయితే ఫర్వాలేదు. లేదంటే... కిరణ్ కెరీర్ మరింత ఇరకాటంలో పడిపోతుంది.