దేశం గర్వించదగిన దర్శకులలో శంకర్ ఒకడు. ఆయన సినిమాలన్నీ వైవిధ్యంగా ఉంటాయి. పాన్ ఇండియా స్థాయిలో ఎప్పుడో అలజడి సృష్టించాయి. అయితే ఒక్కటే గొడవ. శంకర్ సినిమా అంటే బడ్జెట్ ఎట్టి పరిస్థితుల్లోనూ కంట్రోల్‌లో ఉండదు. సినిమాలోని ప్రతీ సీన్‌ని రిచ్‌గా చూపించాలన్న ఉద్దేశంతో భారీగా ఖర్చు పెట్టడం శంకర్‌కి అలవాటు. ముఖ్యంగా సెట్స్ అన్నీ భారీగా ఉంటాయి. దాంతో బడ్జెట్ అదుపు తప్పుతుంది. ముందు అనుకొన్న బడ్జెట్ కీ, ఆ తరవాత అయ్యే ఖర్చునీ అస్సలు పొంతన ఉండదు. ఇండియన్ 2 విషయంలో ఇదే గొడవ జరిగింది. దాంతో.. శంకర్ తన పారితోషికాన్ని తిరిగి ఇవ్వాల్సివచ్చింది. ఇప్పుడు దిల్ రాజు సినిమాకీ ఇదే సమస్య వెంటాడుతోంది.
దిల్ రాజు బ్యానర్‌లో శంకర్ దర్శకత్వంలో, రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. దీనికి `సీఈఓ` అనే పేరు పరిశీలిస్తున్నారు. ఈ సినిమాని ముందు రూ.150 కోట్లలో పూర్తి చేద్దామనుకొన్నారు. ఆ తరవాత మరో రూ.20 కోట్లు పెరిగింది. ఇప్పుడు బడ్జెట్ వేస్తే.. రూ.200 కోట్లు తేలుతుందట. అయితే రూ.200 కోట్లలో ఈ సినిమా ముగియడం కూడా అనుమానమే. చివరికి కనీసం మరో రూ.20 కోట్లయినా బడ్జెట్ దాటుతుందని దిల్ రాజు లెక్కలేస్తున్నాడు. అంటే.. రూ.220 కోట్లవుతుందన్నమాట. ఇంకో విశేషం ఏమిటంటే.. ఇదంతా.. శంకర్ పారితోషికం మినహాయించుకొనే. శంకర్ నామమాత్రంగానే పారితోషికం అందుకొంటున్నాడని, సినిమా హిట్టయితే లాభాల్లో వాటా తీసుకొంటాడని సమాచారం. శంకర్ పారితోషికం కూడా కలుపుకొంటే మరో మొత్తంగా రూ.250 కోట్లయినా తేలే అవకాశాలున్నాయి.