సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రెండో విడత పోలింగ్ స్టార్ట్ అయ్యింది. దేశంలోని 11 రాష్ట్రాలు, ఒక కేంద పాలిత ప్రాంతంలో ఉన్న 95 నియోజక వర్గాల్లో ఈ రోజు రెండో దశ పోలింగ్ స్టార్ట్ అయ్యింది. ఇక తమిళనాడులో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు యాక్టివ్‌గా ముందుకొచ్చారు. సామాన్య జనంతో పోటీ పడి మరీ క్యూ లైన్లలో నిలబడి ఓటు హక్కును బాధ్యతగా నిర్వర్తించారు.
విశ్వనటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్, ఆయన తనయ శృతిహాసన్ క్యూ లైన్‌లో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళ హీరో సూర్య ఆయన భార్య జ్యోతిక కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరికొన్ని జంటలు అజిత్ - షాలినీ జంట, హీరో కార్తి తదితరులు క్యూ లైన్లలో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. టాలీవుడ్‌తో పోల్చితే తమిళనాడులో సినీ గ్లామర్ ఎక్కువగా కనిపించింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముంబై నుండి తమిళనాడు వచ్చారు. ఇళయదళపతి విజయ్, బిచ్చగాడు ఫేం విజయ్ ఆంటోనీ తదితరులు క్యూ లైన్లలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తాను చదువుకున్న స్కూల్‌లోనే ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.