జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఓడలు బళ్లు అవుతుంటాయి. బళ్లు ఓడలుగా మారుతుంటాయి. చీకటి ఎప్పుడూ అలానే ఉండిపోదు. ఏదో ఓ రోజు వెలుగు వస్తుంది. ఆ వెలుగు కోసం ఎదురుచూడడమే జీవితం. కొన్నిసార్లు అంత ఓపిక ఉండదు. భవిష్యత్తు భూతంలా మారి భయపెడుతుంటుంది. గతంలో చేసిన తప్పులు పాపాల్లా వెంటాడుతుంటాయి. అలాంటప్పుడు ఆత్మహత్యే మార్గంలా కనిపిస్తుంటుంది. ఆ బలహీన క్షణాన్ని దాటుకుని రావడం అంత తేలికైన విషయం కాదు. ఆ సమయంలోనే మనకో స్ఫూర్తి కావాలి. కోన వెంకట్ కూడా అలాంటి బలహీనమైన క్షణాన్ని బద్దలు కొట్టుకుని వచ్చినవాడే. ఈ విషయాన్ని ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టాడు కోన వెంకట్.
కోన వెంకట్ రచయిత కాక ముందే `తోకలేని పిట్ట` అనే ఓ సినిమా తీశాడు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం దర్శకుడు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. కోనకు భారీ నష్టాలొచ్చాయి. అప్పులు పెరిగాయి. జేబులో చిల్లి గవ్వ కూడా లేదు. పిల్లల స్కూలు ఫీజులు, ఇంటి అవసరాలు.. ఇలా ఖర్చులు మాత్రం చాలా పెరిగిపోయాయి. ఈ సమయంలోనే వర్మకి ఫోన్ చేసి సహాయం అడుగుదామనుకున్నాడు కోన. ఆ సమయంలో వర్మ ఊర్లో లేడు. `రేపు వచ్చేస్తా.. నిన్ను కలుస్తా` అంటూ ధైర్యం చెబుతున్నా వర్మ రాలేదు. దాంతో ఆశలు కోల్పోయిన కోన వెంకట్.. తన దగ్గర ఉన్న ఆ కొద్ది పాటి డబ్బులతోనే నిద్ర మాత్రలు కొనుక్కుని మెరినా బీచ్‌కి వెళ్లాడు. కాసేపట్లో ఆ నిద్ర మాత్రలు వేసుకుందాం అనుకుంటున్న సమయంలో ఓ పాప కనిపించింది. చేతులూ, కాళ్లూ లేవు. అయినా సరే.. బుడగలు అమ్ముకుంటోంది. ఆమె స్థైర్యాన్ని చూసి కోన ఆశ్చర్యపోయాడట. చేతులూ, కాళ్లూ లేకుండానే అంత నిబ్బరంగా ఉంది, మన దగ్గర అన్నీ ఉన్నాయి కదా, మనం చచ్చిపోవడంలో అర్థం లేదు.. అనుకుని అక్కడి నుంచి వచ్చేశాడట. ఆ తరవాత జరిగిన కథ మనకు తెలిసిందే. వర్మ సహకారంతో కోన నిలదొక్కుకోగలిగాడు. ఇప్పుడు ఓ నిర్మాతగా, రచయితగా స్థిరపడిపోయాడు.
''ఆత్మహత్య చేసుకోవాలనుకున్న క్షణంలో ఆ పాప ఓ దేవతలా వచ్చింది. ఆ పాపని కలుసుకుందామని ఆ తరవాత ఓసారి మెరీనా బీచ్ కి వెళ్లా. కానీ.. తను కనిపించలేదు. నా ప్రాణాలు కాపాడిన దేవత ఆ పాప'' అని గతం గుర్తు చేసుకున్నాడు కోన.