అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు కొరటాల శివ. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను... ఇలా అన్నీ హిట్లే. అయితే ఆ పరంపరకు ఆచార్య బ్రేకులు వేసింది. ఈసినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఇది కచ్చితంగా కొరటాల ఇమేజ్‌కు డామేజీ తెచ్చే ఫలితమే. ఇక ముందు కొరటాలకు అవకాశం ఇవ్వాలనుకున్నవాళ్లు... `ఆచార్య` పేరు గుర్తు తెచ్చుకుని హడలిపోయే ప్రమాదం ఉంది. దర్శకుడిగానే కాదు.. ఆర్థికంగానూ... ఆచార్య కొరటాలను బాగా దెబ్బతీసింది.
ఈ సినిమా కోసం రూ.20 కోట్లు పారితోషికంగా అందుకున్నాడు కొరటాల. అక్కడితో ఆగితే బాగుండేది. కానీ.. చివర్లో.. ఈసినిమా ఆర్థిక లావాదేవీలన్నీ తన భుజాన వేసుకున్నాడు. సినిమాపై నమ్మకంతో. మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థకు ఇవ్వాల్సిందంతా ఇచ్చేసి, సెటిల్ చేసేసి.. వాళ్లను పక్కన పెట్టాడు. ఈ సినిమాకి చరణ్ ఓ నిర్మాత.కాకపోతే. చరణ్, చిరులు కూడా పారితోషికం మాత్రం తీసుకుని సైడ్ అయిపోయారు. బయ్యర్లతో మాట్లాడడం, రేట్లు ఫిక్స్ చేయడం.. ఇవన్నీ కొరటాలనే చూసుకున్నాడు. చివర్లో ఫైనాన్స్ సెటిల్ చేయాల్సి రావడంతో.. సొంత డబ్బు కూడా పెట్టుబడిగా పెట్టాల్సివచ్చింది. అలా.. కొరటాలవే దాదాపు 30 కోట్ల వరకూ ఉన్నట్టు టాక్. ఇప్పుడు అవన్నీ పోయినట్టే అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.