గత కొద్ది రోజులుగా `ఆచార్య` వ్యవహారం టాలీవుడ్ లో బాగా నలుగుతోంది. సీడెడ్ లో ఈ సినిమాని కొన్న బయ్యర్లంతా... హైదరాబాద్‌లోని కొరటాల శివ ఆఫీసుకు వచ్చి, డబ్బులు సెటిల్ చేస్తే గానీ, వెనక్కి తిరిగి వెళ్లం.. అని భీష్మించుకుని కూర్చున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం సెటిల్ చేద్దామని కొంతమంది గట్టిగాప్రయత్నించారు. కానీ.. బయ్యర్లు ఎవరి మాటా వినలేదు.
చివరికి కొరటాల శివ రంగంలోకి దిగి.. రూ.4.75 కోట్లు వెనక్కి ఇస్తానని మాట ఇవ్వడంతో.. ఈ వ్యవహారం సెటిల్ అయ్యింది. ఇప్పటికే... కొరటాల శివ... చాలా వరకూ డబ్బు వెనక్కి ఇచ్చారు. దాంతో.. ఆయన ఆస్తుల్ని అమ్ముకోవాల్సివచ్చిందని సమాచారం. ఇలాంటి సెటిల్‌మెంట్లు ఇంకా చాలా చేయాల్సివుంది.
ఇప్పుడు ఈ ఇష్యూలో... `ఆచార్య` అసలు నిర్మాత నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగారు. నిజానికి `ఆచార్య`కి పెట్టుబడి పెట్టింది ఆయనే. కానీ.. దర్శకుడితో వచ్చిన విబేధాల వల్ల... ఆయన తన పెట్టుబడిని తీసుకొని వెనక్కి వెళ్లిపోయారు. దాంతో.. ఈ సినిమా ఆర్థిక లావాదేవీలన్నీ.. కొరటాలపైనే పడ్డాయి. ఇప్పుడు ఈ నష్టాల్లో అసలు నిర్మాతకీ వాటా ఉందని, ఆయనకూడా ఎంతో కొంత ఇవ్వాలని బయ్యర్లు పట్టుబట్టారు. కొరటాల శివ ఒక్కడిపైనే భారం పడకుండా, నిరంజన్‌రెడ్డి కూడా తన వంతు సాయం చేశారని, ఆయన రూ.10 కోట్లు వెనక్కి ఇచ్చారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి.. ఈ ఇష్యూ ఇప్పుడు సద్దుమణిగినట్టే.