దేశమంతా టాలీవుడ్ వైపే చూస్తోంది. ఇక్కడి హీరోలు, టెక్నీషియన్ల వైపు ఓ కన్నేస్తోంది. తెలుగులో స్టార్ హీరో సినిమా వస్తోంటే ముందు బాలీవుడ్ లో అటెన్షన్ మొదలైపోతోంది. తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎదిగిపోయింది సినీ ప్రముఖులు పొగిడేస్తున్నారు. ఇదంతా పైపైనే. లోలోపల టాలీవుడ్ లో చాలా సమస్యలున్నాయి. ఓ సినిమా హిట్టయితే.. ఇరవై, ముఫ్ఫై సినిమాలు కుదేలైపోతున్నాయి. పది సినిమాలతో సంపాదించిందంతా ఓ సినిమాతో పోగొట్టేస్తున్నాడు నిర్మాత. బాహుబలి, పుష్ఫ, ఆర్.ఆర్.ఆర్‌లు చూసి పొంగిపోవడం కాదు. దాన్ని మించి ఫ్లాపులు... టాలీవుడ్ పరిశ్రమని మొత్తం మింగేస్తోంది. అందుకే నిర్మాతలు ఇప్పుడు మేల్కొన్నారు. తమ డిమాండ్లని నెరవేర్చుకొనేంత వరకూ... అందరూ ఒక్క తాటిపై నడవాలని నిర్ఱయించుకొన్నారు. నిర్మాతలంతా ఏకమై.. టాలీవుడ్ ని స్థంభింపజేయాలని నిర్ణయానికి వచ్చారు.
టాలీవుడ్ లో `సమ్మె` అనే మాట అప్పుడప్పుడూ వినిపించేదే. ఎవరు `సమ్మె` అనే మాటెత్తినా... నిర్మాత గుండెల్లో రాయి పడుతుంది. అయితే ఇప్పుడు ఏకంగా నిర్మాతలే బంద్ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. దానికి కారణాలు బోలెడు. ప్రొడక్షన్ పేరుతో వేస్టేజీ ఎక్కువ అవుతోంది. హీరోలు పారితోషికాలు అమాంతం పెంచేస్తున్నారు. దర్శకుడు అనుకొన్న బడ్జెట్ లో సినిమా పూర్తి చేయడం లేదు. అదనపు ఖర్చులు రోజు రోజుకీ పెరుగుతూ పోతున్నాయి. ఇవన్నీ సమస్యలే. వీటికి పరిష్కారం కావాలన్నది నిర్మాతల మాట. అందుకే శనివారం టాలీవుడ్ నిర్మాతలంతా ఓ కీలకమైన మీటింగ్ పెట్టుకొన్నారు. తామంతా కలిసి సమ్మెకు పిలుపు ఇస్తే ఎలా ఉంటుంది? అనే విషయంపై... తీవ్రంగా ఆలోచించారు. ఆదివారం కూడా ఈ మీటింగ్ కొనసాగింది. సోమవారం నుంచి సమ్మె సైరన్ మోగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. తమ బాధల్ని హీరోలకు, దర్శకులకు చెప్పుకోవడానికి ఇదే సరైన సమయం అని నిర్మాతలు భావిస్తున్నారు.
నిర్మాతలే షూటింగులు ఆపేస్తే.. చిత్రసీమ తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. ఎక్కడి షూటింగులు అక్కడ ఆగిపోతే చాలా నష్టం. వేలాదిమంది కార్మికులు సినిమానే నమ్ముకొని బతుకుతున్నారు. వాళ్ల జీవితాలు గందరోళంలో పడినట్టే. సినిమాలు ఆపేయడం వల్ల నిర్మాతలకూ నష్టమే. ప్రొడక్షన్‌లో ఉన్న సినిమాలపై వడ్డీ పెరుగుతూ పోతుంది. అయినా సరే... సమ్మె చేద్దామనే డిసైడ్ అయితే మాత్రం టాలీవుడ్ లో కొత్త కష్టాలు మొదలైనట్టే.