సినిమా అంటేనే అంత. రాత్రికి రాత్రి జాతకాలు మార్చేస్తుంది. బళ్లు ఓడలు అవుతాయి. ఓడలు బళ్లవుతాయి. కొరటాల శివ విషయంలోనూ అదే జరిగింది. `ఆచార్య` ఆయన జీవితాన్ని, ఆర్థిక స్థితుగతుల్ని తల్లకిందులు చేసింది.
చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ఆచార్య. కొరటాలకు అప్పటి వరకూ ఫ్లాపులు లేవు. పైగా చిరంజీవితో సినిమా. అందుకే ఈ సినిమాపై బాగా క్రేజ్ పెరిగింది. దాంతో బిజినెస్ వర్గాల నుంచి ఆసక్తి మొదలైంది.
ఈ సినిమాపై కొరటాల కూడా బాగా నమ్మకముంచాడు. అందుకే బిజినెస్ వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన సినిమా ఇది. ఓ దశలో ఆచార్య ఆలస్యం అవ్వడంతో మాట్నీ తప్పుకొంది. దాంతో మాట్నీకి డబ్బులన్నీ క్లియర్ చేసి, నిర్మాణ బాధ్యతల్నీ తాను మోశాడు కొరటాల. అలా.. ఈ సినిమాపై చాలా రిస్క్ తీసుకొన్నాడు. తీరా చూస్తే... సినిమా అట్టర్ ఫ్లాప్. దాంతో డిస్టిబ్యూటర్లకు డబ్బులు సెటిల్ చేయాల్సివచ్చింది. తన పారితోషికంతో పాటు మరో 15 కోట్ల వరకూ కొరటాల ఎదురు ఇవ్వాల్సివచ్చింది. తాజాగా కొరటాల తన ప్రాపర్టీని కూడా అమ్ముకొన్నాడని టాక్. మొత్తానికి.. ఆచార్య ఆర్థిక వ్యవహారాలన్నీ క్లియర్ చేసుకొని. ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కించాలని చూస్తున్నాడు. బహుశా.. ఆచార్యతో కొరటాలకు జ్ఞానోదయం అయ్యి ఉంటుంది. ఇలా సినిమా నిర్మాణ బాధ్యతల్నీ నెత్తిమీద వేసుకొనే తప్పు.. కొరటాల ఇంకెప్పుడూ చేయడేమో..?