దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది. ప్రధాని నరేంద్ర మొడీ ఇళయరాజాకు శుభాకాంక్షలు తెలిపారు. ''ఇళయరాజా జీ క్రియేటివ్ జీనియస్. ఆయన సంగీతం జనరేషన్స్ ని ఆకట్టుకుంది. ఆయన సంగీతం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఉద్వేగం. అతని జీవిత ప్రయాణం కూడా అంతే స్ఫూర్తిదాయకం. అతను నిరాడంబరమైన నేపథ్యం నుండి ఎదిగి గొప్ప కీర్తిని సాధించారు. ఆయన రాజ్యసభకు నామినేట్ కావడం సంతోషంగా ఉంది'' అని రాసుకొచ్చారు ప్రధాని మోడీ.
ఇళయరాజాకి రాజ్యసభ ఇస్తారని గతంలో ప్రచారం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ – ప్రధాని నరేంద్ర మోడీ మధ్య కొన్ని అద్భుతమైన పోలికలు ఉన్నాయని ఓ పుస్తకానికి ముందుమాట రాశారు ఇళయరాజా. ''ఈ ఇద్దరూ కష్టాలను ఎదుర్కొన్నారని, సమాజంలోని సామాజికంగా బలహీన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న అసమానతలకు వ్యతిరేకంగా విజయం సాధించారని, దేశం గురించి వీరిద్దరికీ పెద్ద కలలు ఉన్నాయని కీర్తించారు ఇళయరాజా. దీనిపై గతంలో చాలా చర్చ జరిగింది. ఇళయరాజాకి రాజ్యసభ ఖరారైయిందని ఢిల్లీ వర్గాలు కూడా పేర్కొన్నాయి. ఇప్పుడు ఇళయరాజాని రాజ్యసభకు స్వాగతం పలికారు మోడీ
విజయేంద్ర ప్రసాద్ కి రాజ్యసభ: ప్రముఖ సినీ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా రాజ్యసభ సభ్యునిగా ఎంపికయ్యారు. బాహుబలి, భజిరంగీ భాయిజాన్ ,ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా సినిమాలతో కథా రచయితగా విశేష గుర్తింపు తెచ్చుకున్న ఆయనకి రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.