చిరంజీవి 152వ చిత్రం `ఆచార్య` ఇప్నుడు చిత్రీకరణ దశలో ఉన్న సంగతి తెలిసిందే. కరోనాతో బందు ప్రకటించకపోతే ఈపాటికి సగం సినిమా పూర్తయ్యేదే. కానీ కరోనా వల్ల బ్రేకులు పడ్డాయి. ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేయాలన్నది చిరు ప్లాన్. అయితే సడన్ గా షూటింగులు ఆగిపోవడం వల్ల దసరాకి రాకపోవొచ్చని మెగా ఫ్యాన్స్ నీరస పడ్డారు. అయితే చిరంజీవి ఆలోచనలు మాత్రం వేరుగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని దసరా కంటే ముందే విడుదల చేయాలని చిరు భావిస్తున్నారు.
జూలైలో ఆచార్యని విడుదల చేయాలన్నది చిరు ప్లాన్. అది కష్ట సాధ్యం కూడా కాదు. ఏప్రిల్ చివరి వారంలో షూటింగులు మళ్లీ మొదలవుతాయి అనుకుంటే... చక చక నిర్మాణం పూర్తి చేయొచ్చు. షూటింగు ఎప్పుడు మొదలైనా సరే, ఎలాంటి బ్రేకూ లేకుండా ఈ సినిమాని పూర్తి చేయాలని కొరటాలని చిరు ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే చిరు నిర్ణయం పట్ట కొరటాల కాస్త అయోమయానికి గురైనట్టు తెలుస్తోంది. షూటింగులు ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి ఇది. అనుకున్న సమయానికి సినిమా పూర్తి కావడమే కష్టం. అలాంటిది అనుకున్న సమయం కంటే ముందే సినిమాని సిద్ధం చేయడం అసాధ్యమని కొరటాల భావిస్తున్నాడట. అలా చేస్తే సినిమాని చుట్టేసినట్టు అవుతుందని కొరటాల భయపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో చిరుని వాస్తవ పరిస్థితిని వివరించి, కాస్త లేటుగా అయినా సరే మంచి సినిమా తీసేలా చిరుని ఒప్పించడానికి కొరటాల ప్రయత్నిస్తున్నట్టు సమాచారం అందుతోంది.