చిరంజీవి, ప్రకాష్ రాజ్‌లలో ఎవరు గొప్ప నటుడు? - నిజానికి ఇది అర్థం లేని ప్రశ్న. కాకపోతే.. ఈ ప్రశ్న లేననెత్తింది ఎవరో కాదు. ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు. ఈసారి జరిగిన `మా` ఎన్నికలలో తాను పోటీ చేయకపోయినా కోట శ్రీనివాసరావు సెంట్రాఫ్ అట్రాక్షన్ అయ్యారు. విష్ణు టీమ్ కి కోట సపోర్ట్ చేస్తూ... ప్రకాష్ రాజ్ పై కోట తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రకాష్‌రాజ్ అహంకారి అని, సెట్ కి సరిగా రాడని, తనకు క్రమశిక్షణ లేదని... కోట వ్యాఖ్యానించారు. ప్రకాష్ రాజ్ తరపున నాగబాబు వకాల్తా పుచ్చుకుని మాట్లాడిన సంగతి కూడా గుర్తుండే ఉంటుంది. ప్రకాష్ రాజ్ జాతీయ అవార్డు గ్రహీత అని, ఆయన్ని గౌరవించడం నేర్చుకోవాలని కోటకు పరోక్షంగా హితవు పలికారు.
అయితే ఇప్పుడు మరోసారి ప్రకాష్ రాజ్ ప్రస్తావన తీసుకొచ్చారు కోట. ''ప్రకాష్‌రాజ్ కి జాతీయ అవార్డు రావొచ్చు. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన్ని గొప్ప నటుడు అంటారా? అయితే.. చిరంజీవికి అవార్డు రాలేదు. అలాగని ఆయన గొప్ప నటుడు కాదా? చిరుకి అవార్డు రాకపోయినా.. ఆయన మంచి నటుడే'' అన్నారు కోట. అంతేకాదు.... తనని విమర్శించిన నాగబాబుపై కూడా కౌంటర్లు వేశారు. చిరు. పవన్ ల సోదరుడు కాకపోతే నాగబాబుకి అంత ప్రాధాన్యం ఉండేది కాదని, ఆయన కేవలం ఓనటుడిగానే ఉండిపోయేవాడని వ్యాఖ్యానించారు. `మా` ఎన్నికలు అయిపోయినా.. నటీనటుల మధ్య ఇలా విమర్శలు, ప్రతివిమర్శలూ సాగుతున్నాయంటే - ఈ వేడి ఇప్పట్లో తగ్గేది లేదని తేటతెల్లమైపోతోంది. మరి... ఈ రగడ ఎప్పటికి చల్లారునో?