ఈ సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల్లో `క్రాక్` ఒకటి. రవితేజ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. శ్రుతిహాసన్ నాయిక. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఈ సంక్రాంతికి వచ్చే మంచి మాస్ సినిమా ఇదేనని ఫిల్మ్‌నగర్ వాసుల అంచనా. అయితే ఇప్పుడు ఈ సినిమా సంక్రాంతికి వస్తుందా? రాదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జనవరి 1 సందర్భంగా ట్రైలర్ విడుదల చేశారు. అందులో రిలీజ్ డేట్ ఇవ్వలేదు. సంక్రాంతికి మరో రెండు వారాలే సమయం ఉంది. అయినా సరే, రిలీజ్ డేట్ ఇవ్వకపోవడమేంటన్నది ప్రశ్న.
ఈ సినిమా నిర్మాత ఠాగూర్ మధుని కొన్ని ఆర్థిక సమస్యలు, పాత బాకీలూ వెంటాడుతున్నాయి. ఇది వరకు ఓ తమిళ సినిమా కోసం చేసిన అప్పులు.. ఈ సినిమా విడుదలకు అడ్డు పడుతున్నాయి. తెలుగునాట ఓ బయ్యర్ కి ఠాగూర్ మధు 3 కోట్ల వరకూ ఇవ్వాలట. ఇప్పుడు ఆ బాకీ తీర్చందే సినిమా విడుదల చేయడానికి వీల్లేదని సదరు బయ్యర్.. ఛాంబర్ లో ఫిర్యాదు చేసినట్టు టాక్. ఇవన్నీ తేలితే గానీ, క్రాక్.. ఈ సంక్రాంతికి రాదు.