నటీనటులు : సిద్దూ జొన్నలగడ్డ, శ్రద్దా శ్రీనాథ్, సీరత్ కపూర్ తదితరులు
దర్శకత్వం : రవికాంత్ పేరెపు
నిర్మాతలు : సురేష్ ప్రొడక్షన్స్, సంజయ్ రెడ్డి
సంగీతం : శ్రీ చరణ్ పాకాల
సినిమాటోగ్రఫర్ : షానేల్ డియో, సాయి ప్రకాష్
ఎడిటర్: గ్యారీ, రవికాంత్, సిద్దూ
రేటింగ్: 2.75/5
అమేజాన్, నెట్ ఫ్లిక్స్ పుణ్యమా అని ఈ లాక్ డౌన్ సమయంలో ఇంటి వద్దనే కూర్చుని కొత్త సినిమాలు చూసే వీలు దక్కుతోంది. మొన్నటికి మొన్న `పెంగ్విన్` అమేజాన్ లో దర్శనమిచ్చింది. ఇప్పుడు `కృష్న అండ్ హిజ్ లీల` నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. థియేటర్ రిలీజ్ కోసం తీసిన సినిమా అయినా, థియేటర్లు లేకపోవడంతో... ఓటీటీ వేదికపైకొచ్చిన కృష్ణ లీల ఎలా వుంది? ఇందులో ఉన్న ప్లస్‌లేంటి? మైనస్‌లేంటి?
* కథ
కృష్ణ (సిద్ధూ జొన్నలగడ్డ), సత్య(శ్రద్ధ శ్రీనాథ్) ని ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సివస్తుంది.
కొంతకాలానికి రాధ(షాలిని)ని ప్రేమిస్తాడు. ఉద్యోగం కోసం బెంగళూరు షిఫ్ట్ అయిన కృష్ణకు అక్కడ సత్య కనిపిస్తుంది. అనూహ్యంగా.. వీరిద్దరి మధ్య మళ్లీ ప్రేమ చిగురిస్తుంది. అలాగని రాధని వదులుకోలేడు. ఇద్దరినీ ఒకేసారి.. ప్రేమిస్తుంటాడు. చివరికి కృష్ణ ఎవరి సొంతమయ్యాడు? ఈ ప్రేమ లీల చివరి మజిలీ ఏమిటి? అనేది తెలియాలంటే `కృష్ణ లీల` చూడాల్సిందే.
* విశ్లేషణ
ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ. కొత్త కథేం కాదు. కానీ.. ఈ జనరేషన్‌కి నచ్చేలా తీర్చిదిద్దారు. ఈతరం యువకుల ప్రేమలో ఉండే గందరగోళం, నిర్ణయాలు తీసుకోవడంలో సిందిగ్థత, వాళ్ల దృష్టిలో ప్రేమకున్న అర్థం ఇవన్నీ - కలగలిపి రాసుకున్న కథ ఇది. కృష్ణ - సత్యల బ్రేకప్, ఆ తరవాత.. కృష్ణ రాధ ప్రేమలో పడడం, కృష్ణ - సత్య మళ్లీ కలుసుకోవడం - ఇలాంటి రొటీన్ సన్నివేశాలు సైతం ఈతరం ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దాడు దర్శకుడు. అక్కడక్కడ కాస్త రొమాన్స్, ఒకట్రెండు బూతులు మినహాయిస్తే.. కుటుంబ ప్రేక్షకులు హాయిగా ఈ సినిమాని చూసేయొచ్చు. సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలంగా మారింది. హెవీ మెలోడ్రామాలూ, భారీ డైలాగులు వీటికి చోటు లేకుండా... అత్యంత సహజంగా, ఈనాటి వెబ్ ప్రేక్షకుల టేస్ట్‌కి తగ్గట్టు ఈ సినిమాని రూపొందించారు.
ప్రేమకథల్లో కెమిస్ట్రీ చాలా ముఖ్యం. సత్య- కృష్ణ, రాధా - కృష్ణ పాత్రల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేది పాత కాన్సెప్టే అయినా.. చూడ్డానికి ఎప్పుడూ గమ్మత్తుగానే ఉంటుంది. అది కూడా ఈసినిమాకి ప్లస్ పాయింటే. అయితే కెమిస్ట్రీ కంటే ఎమోషన్స్ చాలా ముఖ్యం. వాటిని పట్టుకోవడంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. అన్నీ ఊహాజనిత సన్నివేశాలే. క్లైమాక్స్ తో సహా. ద్వితీయార్థంపై ఇంకాస్త ఫోకస్ పెట్టి, క్లైమాక్స్ ప్రేక్షకుల ఊహలకు భిన్నంగా రాసుకుని ఉంటే.. కృష్ణ లీల తప్పకుండా మాయ చేసేదే. అయితే ఇప్పటికీ మించిపోయిందేం లేదు. నెట్ ఫ్లిక్స్‌లో హాయిగా రెండుగంటల కాలక్షేపం ఇచ్చే సినిమా ఇది.
* నటీనటులు
ఓ కన్‌ఫ్యూజ్ లవర్‌గా సిద్దు నటన ఆకట్టుకుంటుంది. మంచి ఈజ్‌తో నటించాడు. ఈతరం అభిప్రాయాల్ని, అభిరుచుల్ని, గందరగోళాన్నీ తనలో పలికించాడు. జెర్సీ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ కీ మంచి మార్కులు దక్కుతాయి. కొత్త కథానాయిక షాలిని.. ఓకే అనిపిస్తుంది. ఝాన్సీ, సంపత్, హర్ష... ఎవరి పాత్రల్లో వాళ్లు రాణించారు.
* సాంకేతిక వర్గం
ఈ చిత్రానికి ప్రధాన బలం నేపథ్య సంగీతం. సినిమా మూడ్‌కి తగ్గట్టు హాయిగా సాగింది. పాటల్లో గోల లేదు. కెమెరా ఈ కథకుకొత్త అందాన్ని తీసుకొచ్చింది. మాటలు సహజంగా ఉన్నాయి. దర్శకుడు ఓ పాత కథని బాగానే డీల్ చేశాడు. ముందే చెప్పినట్టు క్లైమాక్స్ విషయంలో కాస్త శ్రద్ధ చూపించి ఉంటే మెరుగైన ఫలితం దక్కేది.
* ప్లస్ పాయింట్స్
సున్నితమైన పాయింట్
నటీనటులు
సాంకేతిక వర్గం
* మైనస్ పాయింట్స్
రొటీన్ కథ
క్లైమాక్స్
* ఫైనల్ వర్డిక్ట్: జస్ట్ ఓకే...