బాలీవుడ్ కండల వీరుడు టైగర్ ష్రాఫ్‌కీ, ‘లోఫర్’ ఫేం హీరోయిన్ దిశా పటానీకీ మధ్య ‘లవ్ ఎఫైర్’ ఎప్పటినుంచో నడుస్తోంది. తొలుత శ్రద్ధా కపూర్, టైగర్ ష్రాఫ్ మధ్య ప్రేమాయణం నడిచింది. ఆ తర్వాత దిశ - టైగర్ మధ్య ప్రేమ ముదిరి పాకాన పడింది. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అవన్నీ పాత విషయాలు. కొత్త కహానీ ఏంటంటే, కరోనా లాక్‌డౌన్ వేళ, టైగర్ - దిశా ఒకే ఇంట్లో వుంటున్నారట. అంటే, సహజీవనం అనే కదా లెక్క.! ఈ అనుమానాలకు కారణం టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణా ష్రాఫ్ ఓ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేయడమే. తనకు దిశా పటానీ మేకప్ చేస్తోందంటూ ఓ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కృష్ణ.
అంతే, గాసిప్స్ షురూ అయ్యాయి. హీరో, ఆయన చెల్లెలు.. ఓ హీరోయిన్.. ఒకే ఇంట్లో వుంటున్నారనీ, దీనర్థం సహజీవనమేననీ బాలీవుడ్ మీడియా కోడై కూసేస్తోంది. ఈ వ్యవహారంపై స్పందించిన కృష్ణ, తన సోదరుడితో తాను ఒకే ఇంట్లో వుంటున్నాననీ, దిశా పటానీ మాత్రం కాస్త దూరంగా వేరే అపార్ట్‌మెంట్‌లో వుంటోందనీ చెప్పింది. ‘లాక్‌డౌన్ సడలింపు సమయంలో మేమంతా కలిసి నిత్యావసర వస్తువులు కొనేందుకు వెళుతుంటాం.. అంతే తప్ప, మా అన్నయ్యకీ, దిశకి మధ్య ఎలాంటి ఎఫైర్ లేదు. మేం ముగ్గురం మంచి స్నేహితులం’ అని కృష్ణ వివరించింది.