‘ఆచార్య’ సినిమా గురించి రోజుకో కొత్త గాసిప్ ప్రచారంలోకి వస్తోంది. ప్రస్తుతం సినిమాల షూటింగులేవీ జరగడంలేదు. ఆ మాటకొస్తే, సినిమాలకి సంబంధించి కొత్త ఒప్పందాలు కూడా కుదిరే పరిస్థితి కన్పించడంలేదు. మే 7 తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేస్తారా.? సడలింపులు మాత్రమే ఇస్తారా.? సినీ పరిశ్రమ పట్ల కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.? లాంటి ప్రశ్నల చుట్టూ సినీ పరిశ్రమలో మల్లగుల్లాలు నడుస్తున్నాయి. లాక్‌డౌన్ ఎత్తివేస్తే తప్ప ఏ విషయమ్మీదా స్పష్టత రాదని సినీ ప్రముఖులు అంటున్నారు. అయితే, ఈలోగా కాంబినేషన్లు సెట్ చేయడం, కథలు ప్రిపేర్ చేయడం, వీటితోపాటుగా ఇప్పటికే నిర్మాణంలో వున్న సినిమాలకు సంబంధించి చిన్న చిన్న కరెక్షన్స్‌ని ప్లాన్ చేసుకోవడం జరుగుతోందట. తొలుత ‘ఆచార్య’ సినిమా కోసం రామ్ చరణ్‌ని ప్రత్యేక పాత్రలో తీసుకోవాలనుకున్నారు.
ఈ విషయాన్ని దర్శకుడు కొరటాల శివ, హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా ఓపెన్‌గానే చెప్పారు. కానీ, ఆ తర్వాతే మహేష్ పేరు తెరపైకొచ్చింది. మహేష్ నుంచి నాకు ఓ సందర్భంలో భరోసా లభించింది. అలాగని ఆయన ఈ సినిమా చేస్తారని కాదు.. ఒకవేళ చరణ్ అందుబాటులో లేకపోతే, నేనున్నానని మర్చిపోవద్దంటూ మహేష్ చెప్పాడని కొరటాల చెప్పిన విషయం విదితమే. తాజా ఊహాగానాల ప్రకారం చరణ్, ‘ఆచార్య’కి అందుబాటులో వుండడంలేదట. దాంతో, మహేష్ ఈ సినిమా తప్పక చేయాల్సి వుంటుందేమోనని అంటున్నారు. అయితే ఏ విషయమ్మీద అయినా స్పష్టత రావాలంటే లాక్‌డౌన్ పరిస్థితులు తొలగిపోవాల్సిందే.