నక్షత్రం తరవాత కృష్ణవంశీ నుంచి మరో సినిమా రాలేదు. రంగమార్తండ అనే ఓ సినిమాని ఎప్పుడో మొదలెట్టారాయన. ఆ సినిమా గురించి ఇప్పటి వరకూ ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే సడన్‌గా ఈ సినిమాకి సంబంధించి పాజిటీవ్ రిపోర్ట్స్ రావడం మొదలయ్యాయి. ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ఇది. మరాఠీలో ఘన విజయం సాధించిన `నట సామ్రాట్`కి రీమేక్ ఇది. షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయ్యింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ గానీ, టీజర్ గానీ ఇంత వరకూ బయటకు రాలేదు. జనం కూడా ఈ సినిమా గురించి దాదాపుగా మర్చిపోతున్న తరుణంలో.. ఒక్కసారిగా.. ఈ సినిమా మళ్లీ వార్తల్లోకి నిలిచింది.
ఇటీవల ఈసినిమాని కృష్ణవంశీ కొంతమంది సన్నిహితులకు చూపించారు. వాళ్లంతా చూశాక... ఈ సినిమా గురించి భావోద్వేగమైన పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా ప్రముఖ రచయిత లక్ష్మీ భూపాల తన ఫేస్ బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు. అది బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమా చాలా బాగొచ్చిందని, సినిమా చూశాక.. వంశీగారి కాళ్లమీద పడిపోయానని, ఈ సినిమా చూశాక బ్రహ్మానందం గురించి ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటుందని.. ఆయన తన ఎఫ్ బీ పోస్ట్ లో రాసుకొచ్చారు. ఓ సినిమా గురించి విడుదలకు ముందే... ఓ మినీ రివ్యూ రాశారాయన. ఆ పోస్ట్ తో ఒక్కసారిగా.. ఈ సినిమాపై పాజిటీవ్ వైబ్స్ మొదలైపోయాయి. ఇన్ సైడ్ వర్గాలు సైతం.. ఈ సినిమా బాగా వచ్చిందని, చాలా కాలం తరవాత నికార్సయిన కృష్ణవంశీ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుందని చెబుతున్నారు. కృష్ణవంశీ ఫ్యాన్స్ కోరుకునేది అదే. ఆయన సినిమాలు కమర్షియల్ గా వర్కవుట్ కాకపోయినా, వంశీ మార్క్ కనిపించాలనుకుంటారు. రంగమార్తండతో.. అది జరగబోతోందన్న ఆశలు ఇప్పుడు మొదలయ్యాయి.