శీను వైట్లతో రామ్ చరణ్ 'బ్రూస్‌లీ' సినిమా చేశాడు. అయితే ఆ సినిమా ఆశించినంత విజయం అందుకోలేదు. అందుకే చరణ్‌కి బాకీ పడిపోయా అనే మాట గతంలో శ్రీనువైట్ల చెప్పాడు. ఇప్పుడు అదే మాట కృష్ణవంశీ కూడా అంటున్నాడు. చరణ్ - కృష్ణవంశీ కాంబినేషన్‌లో వచ్చిన 'గోవిందుడు అందరివాడేలే' ఆశించిన విజయం సాధించకపోవడానికి తానే కారణమని అన్నాడు కృష్ణవంశీ. చరణ్ ఆ సినిమాకి చాలా కష్టపడినట్లు చెప్పాడు కృష్ణవంశీ. దురదృష్టవశాత్తూ ఆ సినిమా విజయం సాధించకపోవడంతో, చరణ్‌తో ఖచ్చితంగా ఇంకో సినిమా చేసి, సూపర్ హిట్ కొట్టి, బాకీ తీర్చుకుంటానని కృష్ణవంశీ అన్నాడు. ఎంతమంది వారిస్తున్నా చరణ్, కృష్ణవంశీ మీద నమ్మకం పెట్టి 'గోవిందుడు అందరివాడేలే' సినిమా చేశాడు. కృష్ణవంశీ - చిరంజీవి మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనమిది. సక్సెస్, ఫెయిల్యూర్ ఎవరి చేతుల్లోనూ ఉండదు. ఏదేమైనా ఇంకోసారి చరణ్‌తో సినిమా చేస్తానని కృష్ణవంశీ చెప్పడంతో వీరిద్దరి కాంబినేషన్ మళ్ళీ వస్తుందనే నమ్మకం అయితే పెరుగుతోంది. బాకీ తీర్చేసుకోవడానికి కృష్ణవంశీకి చరణ్ ఛాన్సిస్తాడా? చూడాలి మరి. ప్రస్తుతం కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న 'నక్షత్రం' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సందీప్ కిషన్, రెజీనా, ప్రగ్యా జైశ్వాల్, సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నారు ఈ సినిమాలో. చరణ్ 'రంగస్థలమ్ 1987'తో బిజీగా ఉన్నాడు. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది.