ఈ శుక్రవారం విడుదలైన మూడు సినిమాల్లో 'కృష్ణ వ్రింద విహారి' ఒకటి. నాగశౌర్య కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. అనీష్ కృష్ణ దర్శకుడు. శౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్‌లోనే ఈ సినిమా చేశారు. తొలి రోజు ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. దానికి తగ్గట్టే.. స్లో ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే మిగిలిన రెండు సినిమాలూ 'అల్లూరి', 'దొంగలున్నారు జాగ్రత్త'లతో పోలిస్తే.. కృష్ణ వ్రిందకే టాక్ బాగుంది. దాంతో.. ఈవారం ప్రేక్షకులకు ఈ సినిమానే ఏకైక ఆప్షన్ గా మారింది.
దాంతో పాటు ఫన్ వర్కవుట్ అవ్వడం, ఫ్యామిలీ డ్రామా కావడంతో 'కృష్ణ వ్రింద..'కు వసూళ్లు పెరిగాయి. శుక్రవారంతో పోలిస్తే శనివారం, ఆదివారం వసూళ్లు ఊపందుకొన్నాయి. వచ్చే వారం కూడా పెద్దగా సినిమాలు లేవు. మణిరత్నం సినిమా 'పొన్నియన్ సెల్వన్' ఉన్నా.. దాన్ని డబ్బింగ్ సినిమాగానే చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. దసరా సెలవలు సైతం.. కృష్ణ వ్రిందకు కలిసొచ్చే అవకాశం ఉంది. ఈ వారమంతా కుదురుగా ఉంటే... బాక్సాఫీసు దగ్గర 'కృష్ణ వ్రింద విహారి' గట్టెక్కేసే సూచనలు కనిపిస్తున్నాయి.