కృష్ణం రాజు సినిమాల్లో కి రాకముందు జర్నలిస్ట్ గా పని చేసిన సంగతి తెలిసిందే. కృష్ణం రాజు కు బాబాయ్ వరసయ్యే సిహెచ్ విపి మూర్తిరాజు ఆంధ్రరత్న అనే దినపత్రిక నడుపుతుండేవారు. దానికి మోచర్ల కృష్ణమూర్తి ఎడిటర్. ఆ పత్రికలో జర్నలిస్టుగా చేశారు కృష్ణం రాజు. కేవలం ఒక ఉద్యోగిలానే కాకుండా యాజమాన్యం తరపు వాడిగా ఆయన్ని స్పెషల్ గా ట్రీట్ చేసేవారట. ఇలా జర్నలిస్ట్ గా పని చేస్తున్న సమయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఏకంగా ఒక రౌడీముఠాకి ఎదురెళ్ళారట కృష్ణం రాజు. ఈ సంఘటన గురించి ఒకసారి ఆయనే స్వయంగా చెప్పారు.
''ఒకసారి పత్రికా ఆఫీసులో ఒక వర్కర్ చాలా తల బిరుసుగా వ్యవహరిస్తే వాడిని చాచిపెట్టి కొట్టాను. వాడు గన్ ఫౌండ్రీ ఏరియాలో పెద్ద దాదా అట. 'గన్ ఫౌండ్రీ రా చూసుకుందాం' అని సవాల్ విసిరాడు. నా బైక్ పై ఒంటరిగా గన్ ఫౌండ్రీ వెళ్లాను. ఒక గ్యాంగ్ అఫ్ రౌడీలు మొత్తం కాచుక్కూర్చున్నారు నా కోసం. వెల్లాగానే నా చుట్టూ మూగారు. నేను అలానే స్టయిల్ గా బైక్ పై కూర్చున్నాను. వాళ్ళలో ఒకడు ముందుకు వచ్చి 'మా వాడిని ఎందుకు కొట్టావ్'' అన్నాడు.
ఎందుకో కొట్టాను వివరంగా చెప్పి '' మీ వాడు తప్పు చేశాడు కాబట్టి కొట్టాను. మీరందరూ వాడిని సపోర్ట్ గా వచ్చారు. నేను ఒంటరిగా వచ్చాను కదా అని మీరు నా మీదకు రాదల్సితే రండి... నాకు ఏమైనా ఫరవాలేదు కానీ మీలో ఒక్కడిని కూడా ప్రాణాలతో వదలను.. దమ్ముంటే రండి రా'' అన్నాను. ఇంతలో వాళ్ళలో కాస్త బుర్రా బుద్ధి వున్నవాడొకడు ముందుకొచ్చి ''అది కాదు సర్ తప్పు చేస్తే చెప్పాలిగానీ అలా కొట్టకూడదు కదా ! సరే అయిందేదో అయింది... ఎంతైనా మీరు యజమానులు మా వాడి తరపున సారీ చెప్తున్నాం'' అన్నాడు. అంతే నా కోపం ఇట్టే మాయమైయింది. ఈ సంఘటనతో ప్రెస్ లో అందరూ నన్నొక హీరోలాగా చూసేవారు. అయితే ఇలాంటి గొడవల్లో ఎంత రెబల్ గా వుండేవాడినో పెద్దల పట్ల అంత గౌరవంగా, అణకువగా ఉండేవాడిని'' అని గతాన్ని గుర్తు చేసుకున్నారు కృష్ణం రాజు.