కృష్ణంరాజు మృతితో తెలుగు సినీ పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయినట్లయింది. అయిదున్నర దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులపై ఆయన చెరగని ముద్రవేశారు. 82 ఏళ్ల కృష్ణంరాజు దీర్ఘకాలంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. మధుమేహం, పోస్ట్ కోవిడ్, తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్ రావడంతో చనిపోయారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే కోవిడ్ కి ముందు ఆయన ఆరోగ్యం కుదురుగానే వుండేది. అదే సమయంలో ఒక హోటల్ లో జారిపడ్డారు కృష్ణంరాజు. ఆ ప్రమాదం తర్వాత చాలా ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి. ఈ ప్రమాదం గురించి ఒక సందర్భంలో కృష్ణం రాజు భార్య శ్యామల దేవి స్వయంగా చెప్పారు
'' కృష్ణంరాజు గారికి ఒకే దగ్గర కూర్చోవడం ఇష్టం వుండదు. కరోనా కాలంలో రెండేళ్ళు కూర్చోవడం వలన చాలా ఇబ్బంది పడిపోయారు. ఎవరినీ కలవలేకపోతున్నారు ఎక్కడికి వెళ్ళలేకపొతున్నారని కాస్త రీలిఫ్ కోసం రాడిషన్ హోటల్ కి వెళ్లాం. హోటల్ లో స్లైడిండ్ డోర్స్ వున్నాయి. ఒక డోర్ ని పట్టుకొని కాళ్ళకి వ్యాయామం చేస్తుంటే పొరపాటున జారిపడిపోయారు. కాళ్ళకి దెబ్బకి తగిలింది. అపోలోలో సర్జరీ జరిగింది. ప్రమాదం తప్పినప్పటికీ ఆ గాయంతో చాలా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు'' అని చెప్పారు శ్యామలదేవి.