తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు, రెబల్‌స్టార్ కృష్ణంరాజు ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారుజామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు.
కృష్ణంరాజు 20 జనవరి 1940లో జన్మించారు. చదువు పూర్తయిన తర్వాత కొన్నాళ్లపాటు జర్నలిస్టుగా పనిచేశారు. ఆ తర్వాత సినీ రంగంలో అడుగుపెట్టారు. 1966లో వచ్చిన ‘చిలకా గోరింక’ ఆయన తొలి సినిమా. హీరోగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినప్పటికీ విలన్‌గానూ నటించారు. ‘అవే కళ్లు’ సినిమాలో విలన్‌గా చేశారు. 1977, 1984లో నంది అవార్డులు గెలుచుకున్నారు. 1986లో వచ్చిన ‘తాండ్ర పాపారాయుడు’ సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు.
2006లో ఫిల్మ్‌ఫేర్ దక్షిణాది జీవిత సాఫల్య పురస్కారాన్ని పొందారు. భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న వంటి సినిమాలు ఆయనకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. సాంఘిక చిత్రాలతో పాటు పౌరాణిక, జానపద కథల్లో కూడా నటించి కృష్ణంరాజు తన ప్రత్యేకతని చాటుకున్నారు. గోపీకృష్ణ మూవీస్ పతాకం స్థాపించి ఆ సంస్థలోనూ పలు చిత్రాల్ని నిర్మించారు. ఆయన నట వారసుడిగా తెరంగేట్రం చేసిన ప్రభాస్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోనూ అడుగు పెట్టారు కృష్ణంరాజు. 1999 మధ్యంతర ఎన్నికల్లో నర్సాపురం నుంచి ఎంపీగా గెలుపొంది.. కేంద్ర మంత్రిగానూ సేవలందించారు.