ఇటీవల 'పద్మావతి' చిత్రం విషయంలో జరిగిన రాద్ధాంతాలు, వివాదాల సంగతి తెలిసిందే. దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంజ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు. డిశంబర్ 1న విడుదల కావాల్సి ఉంది ఈ సినిమా. ఈ రకమైన వివాదాల కారణంగా సినిమా విడుదల నిలిపివేయబడింది. ఇకపై ఎప్పుడు విడుదలవుతుందో కూడా తెలీదు.
కాగా తాజాగా సీనియర్ నటుడు కృష్ణంరాజును ఓ ఇంటర్వ్యూలో 'పద్మావతి' సినిమా విషయమై ఆయన ఆభిప్రాయం ఆడగ్గా, సాధారణ కథల్ని తెరకెక్కించేటప్పుడు ఎలా తెరకెక్కించినా పర్వాలేదు. కానీ చరిత్రల విషయానికి వస్తే, కొంచెం ఒళ్లు దగ్గరపెట్టుకుని వ్యవహరించాలి. ఎందుకంటే సెంటిమెంట్లు దెబ్బ తింటాయి. నష్టం జరిగిపోయాక బాధపడేదాని కన్నా, ముందుగానే జాగ్రత్తపడితే బావుంటుందనీ ఆయన అన్నారు. సినిమాల పేరు చెప్పి చరిత్రని వక్రీకరించడం ఎంత మాత్రమూ క్షమించదగ్గది కాదు.. అంటూ తనకున్న అనుభవంతో నేటి సినిమా పోకడలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారాయన.
180 సినిమాలకు పైగా చిత్రాల్లో నటించిన కృష్ణంరాజు, ఇప్పటికీ సీనియర్ నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలో నటిస్తూ, హుందాతనం చూపిస్తున్నారు. 'బిల్లా', 'ఎవడే సుబ్రహ్మణ్యం', 'రుద్రమదేవి' తదితర చిత్రాల్లో నటించారు కృష్ణంరాజు. విలక్షణ చిత్రాలను ఎంపిక చేసుకుంటూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అప్పట్లో రెబల్ స్టార్ అనిపించుకున్న కృష్ణంరాజు ఇప్పటికీ అదే హుందాతనంతో మంచి మంచి సినిమాలను ఎంపిక చేసుకుంటుండడం గొప్ప విషయం.