టాలీవుడ్ లో ప్రస్తుతం అత్యంత బిజీగా ఉన్న కథానాయిక అంటే కృతి శెట్టి పేరే చెప్పుకోవాలి. ఉప్పెనతో దూసుకొచ్చింది కృతి. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో. కృతి జాతకం మారిపోయింది. అప్పటి నుంచీ.. వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. ఉప్పెన తరవాత విడుదలైన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు కూడా మంచి ఫలితాలనే అందుకున్నాయి. దాంతో... కృతి లక్కీ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడామె చేతిలో నాలుగు సినిమాలున్నాయి. తాజాగా శర్వానంద్ సినిమాలో నటించే ఆఫర్ కూడా వచ్చింది. తొలుత ఈ సినిమా చేయడానికి కృతి ఒప్పుకొంది. కానీ..చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చింది. `ఈ సినిమా నేను చేయను గాక చేయను` అని చేతులెత్తేసింది. దానికి కారణం.. ఈసినిమాలో తనది `మదర్` క్యారెక్టర్ అట.
శర్వానంద్ కథానాయకుడిగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇందులో కథానాయికగా కృతిని సంప్రదించారు. శర్వానంద్ సినిమా అనగానే.. కృతి చేస్తా.. అనేసిందట. అయితే కథ విన్నాక `నో` చెప్పింది. ఎందుకంటే.. ఈ సినిమాలో శర్వా ఓ బిడ్డకు తండ్రిగా నటించబోతున్నాడు. అంటే.. కృతిది తల్లి పాత్రే కదా..? ఈ వయసులో.. తల్లి పాత్రేమిటి? నాకు బాగోదు.. అని దర్శక నిర్మాతలకు సున్నితంగా చెప్పి తప్పించుకుందట. పాత్ర తీరుతెన్నుల మారిస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నా... అని చెప్పిందట. కృతి కోసం కథ ఎక్కడ మారుస్తారు..? అందుకే నిర్మాతలు ఇప్పుడు మరో కథానాయికని వెదికే పనిలో పడ్డారు.