సూపర్ స్టార్ మహేష్‌బాబు సరసన '1 నేనొక్కడినే' సినిమాలో నటించిన బాలీవుడ్ భామ కృతి సనన్ గుర్తుంది కదా? తెలుగులో ఆమె మరో సినిమాలో కూడా నటించింది. నాగచైతన్య సరసన 'దోచెయ్' సినిమాలో నటించిన ఈ భామ, 'మీటూ' ఉద్యమంపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
మహిళలు ధైర్యంగా తమకు ఎదురైన లైంగిక వేధింపుల ఘటనలపై స్పందిస్తున్నందుకు ఆనందంగా వుందని చెబుతూనే, కొందరు తమ పేర్లను వెల్లడించకుండా 'మీటూ' అంటూ ప్రముఖులపై బురద జల్లుతున్నారనీ, ఆ కారణంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు దోషులైపోరని కృతి సనన్ అభిప్రాయపడింది. పేర్లు చెప్పకుండా ఆరోపణలు చేసేవారి పట్ల అప్రమత్తంగా వుండాలనీ, ఎవరైనా ఆరోపణలు చేయడానికి ముందు పోలీసులను ఆశ్రయిస్తే, ఆ ఆరోపణలకు సంబంధించి విచారణ ప్రారంభమవుతుందనీ, తద్వారా 'మీటూ' ఉద్యమానికి బలం చేకూరుతుందని కృతి సనన్ చెప్పింది.
కేంద్ర మంత్రి, సీనియర్ పాత్రికేయుడు ఎంజె అక్బర్, బాలీవుడ్ ప్రముఖులు నానా పటేకర్, సాజిద్ ఖాన్, అలోక్ నాథ్ వంటివారు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెల్సిందే. అయితే వీరంతా తమపై వస్తున్న ఆరోపణలపై న్యాయ పోరాటానికి సిద్ధమంటున్నారు. కుట్రపూరితంగా తమపై కొందరు ఆరోపణలు చేస్తున్నట్లు మండిపడుతున్నారు. 'మీటూ' ఉద్యమం విషయంలో 'పబ్లిసిటీ స్టంట్' అనే ఆరోపణలు ఉన్న సంగతి తెల్సిందే.
ఈ పరిస్థితుల్లో ఓ హీరోయిన్, 'మీటూ' ఉద్యమం గురించి స్పందించడం, పైగా ఆరోపణలతోనే ఆయా వ్యక్తులు దోషులైపోరనడం, ఖచ్చితంగా ఆమెను ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ఎందుకంటే, ఆరోపణలు చేసినవారికి అనూహ్యమైన పబ్లిసిటీ మాత్రమే కాదు, వారిపై బోల్డంత సానుభూతి లభించేస్తోంది. వారిని ప్రశ్నించేవారికి మాత్రం చీవాట్లు తప్పడంలేదు.