అమీర్ ఖాన్ సినిమా వస్తోందంటే... దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసేవారు. దానికీ చాలా కారణాలున్నాయి. అమీర్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్. ఓ కథ ఎంచుకొన్నాడంటే.. అందులో కచ్చితంగా విషయం ఉండే తీరుతుంది. తన సక్సెస్ రేటు కూడా చాలా ఎక్కువ. వసూళ్లలో ఆల్ ఇండియా రికార్డు ఇప్పటికీ తన పేరుమీదే ఉంది. అందుకే అమీర్ సినిమా అంటే అంత క్రేజ్. అయితే.. ఇప్పుడు అమీర్ నుంచి వస్తున్న లాల్ సింగ్ చద్దాకి ఎలాంటి క్రేజూ లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈనెల 11న ఈ సినిమా వస్తోంది. కానీ.. పెద్దగా బజ్ ఏర్పడలేదు. పైగా `బాయ్ కాట్ అమీర్ సినిమా` అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా.. అమీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తన సినిమాపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఈ సినిమా చూడొద్దని హిందూ మత సంఘాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.
మరోవైపు లాల్ సింగ్ చద్దా ప్రీమియర్లని ఇటీవల హైదరాబాద్ లో ప్రదర్శించారు. ఈ షోకి సెలబ్రెటీలంతా వచ్చారు. అయితే సినిమా చూశాక ఒక్కరు కూడా ట్వీట్ చేయలేదు. సాధారణంగా షో అవ్వగానే సెలబ్రెటీలు పాజిటీవ్ ట్వీట్లతో విరుచుకుపడతారు. కానీ లాల్ సింగ్ చద్దా విషయంలో అదేం జరగలేదు. ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటించాడు. దాంతో తెలుగులో ఇంకాస్త హైప్ రావాలి. కానీ.. అనుకున్న దానికంటే తక్కువ బజ్ తో ఈ సినిమా వస్తోంది.