ఆయనో పెద్ద స్టార్ హీరో.. ఆయన సినిమా వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ రికార్డులు బద్దలైపోవాల్సిందే. పైగా, ఇటీవలి కాలంలో చిన్న సినిమాలతో సంచలన విజయాలు అందుకుంటున్నాడు ఆ యంగ్ హీరో. అన్నట్టు, ఈ మధ్యనే కరోనా వైరస్‌పై పోరాటం కోసం ‘పీఎం కేర్స్’కి పెద్దయెత్తున విరాళం ప్రకటించాడు.. ఇంకా ఇంకా సేవా కార్యక్రమాల కోసం వెచ్చిస్తూనే వున్నాడు. పరిచయం అక్కర్లేని పేరు అది. ఆయనే, అక్షయ్ కుమార్. ఈ హీరో ఇప్పుడు తన కొత్త సినిమా ‘లక్ష్మీ బాంబ్’ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ మీద విడుదల చేయబోతున్నాడట.
కొరియోగ్రాఫర్ టర్న్‌డ్ డైరెక్టర్ లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన ‘లక్ష్మీబాంబ్’లో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించిన విషయం విదితమే. తెలుగులో లారెన్స్, లక్ష్మీ రాయ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘కాంచన’ సినిమాకి ఇది హిందీ రీమేక్. నిజానికి ‘కాంచన’ తమిళ సినిమా. తమిళంతోపాటు తెలుగులోనూ, ఇతర భాషల్లోనూ విడుదలయ్యింది. ఆ ‘కాంచన’ సినిమానే ఇప్పుడు బాలీవుడ్‌లో ‘లక్ష్మీబాంబ్’ పేరుతో నిర్మించారు. అయితే, మొదట్లో కొన్ని వివాదాలు లారెన్స్‌ని ఇబ్బంది పెట్టాయి. కానీ, అక్షయ్‌కుమార్ మాత్రం లారెన్స్‌కి అండగా నిలిచాడు. ఇదిలా వుంటే, త్వరలోనే ఈ సినిమా ‘ఓటీటీ’పై విడుదల కాబోతోందనీ, ప్రాథమిక చర్చలు కూడా పూర్తయ్యాయనీ అంటున్నారు. చిత్ర నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని ధృవీకరించాల్సి వుంది.