'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకి పెద్ద షాకే తగిలింది. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఈ సినిమా విడుదలవడం కలకలం రేపింది. 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై ఎన్నికల కమీషన్ విధించిన నిషేధం అమలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే నిషేధ ఆజ్ఞల్ని ఉల్లంఘించి, రెండు ధియేటర్స్‌లో ఈ సినిమాని ప్రదర్శించడం వివాదాస్పదమైంది. సినిమా ప్రదర్శన కారణంగా ఓ ఉన్నతాధికారిపై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ధియేటర్ల లైసెన్స్‌ని రద్దు చేసే ఆలోచనలో అధికార యంత్రాంగం ఉందని సమాచారమ్. అనకాపల్లిలో కూడా సినిమా ప్రదిర్శితమైనట్లు వార్తలు వచ్చాయి. దానిపై ఎన్నికల కమీషన్ ఇంకా స్పందించాల్సి ఉంది. ప్రస్తుతానికి కడపలో సినిమా ప్రదర్శన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ తతంగం వెనకాల ఎవరున్నారనే దిశగా విచారణ జరుగుతోంది.
రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఆంధ్రప్రదేశ్ మినహా అంతటా ఇదివరకే విడుదలై, చెప్పుకోదగ్గ విజయాన్నే అందుకుంది. తెలుగుదేశం పార్టీ అభ్యంతరాలతో ఆంధ్రప్రదేశ్‌లో సినిమా విడుదల కాలేదు. ఆంధ్రప్రదేశ్‌లో 'లక్ష్మీస్ ఎన్టీఆర్'తో పాటు దేశ వ్యాప్తంగా పీ.ఎం నరేంద్రమోడీ సినిమా కూడా విడుదలకు నోచుకోలేదు. మే 23 తర్వాతే ఈ సినిమాలు విడుదల కావచ్చు.