మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ అంటే తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితుడే. కాగా, ఎన్టీఆర్‌తో 'జనతా గ్యారేజ్' సినిమాలో నటించి మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమా సాధించిన సక్సెస్‌తో మోహన్‌లాల్ డబ్బింగ్ సినిమాలైన 'మన్యం పులి' తదితర సినిమాలు కూడా తెలుగులో మంచి వసూళ్లు రాబట్టాయి. ఇదిలా ఉంటే, తమిళంలోనూ మోహన్‌లాల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది.
గతంలో ఇళయదళపతి విజయ్ సినిమాలో కీలకపాత్రలో కనిపించి, తమిళ తంబీల మనసు గెలుచుకున్నాడు మోహన్‌లాల్. తాజాగా సూర్య హీరోగా తెరకెక్కుతోన్న ఓ సినిమాలో నటిస్తున్నాడు. కేవీ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో సూర్యతో 'వీడొక్కడే', 'బ్రదర్స్' సినిమాలను తెరకెక్కించాడు కేవీ ఆనంద్. ముచ్చటగా మూడో చిత్రంగా సూర్యతో తెరకెక్కిస్తోన్న తాజా చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌ని కీలక పాత్ర కోసం ఎంచుకున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది.
భారీ బడ్జెట్ చిత్రంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారట లైకా ప్రొడక్షన్స్ సంస్థ. నిర్మాణ బ్యానర్‌ని బట్టి, రెండు భాషలకు చెందిన స్టార్ హీరోల ఇమేజ్‌ని బట్టి ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మరో పక్క సూర్య ప్రస్తుతం సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. 'ఎన్జీకే' టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలోనే మన స్మైలీ బ్యూటీ రకుల్ ప్రీత్‌సింగ్, 'ఫిదా' బ్యూటీ సాయి పల్లవి, సూర్యతో జత కడుతున్నారు.