ఏపీ, తెలంగాణలలో థియేటర్లు తెరచుకోవడానికి ప్రభుత్వాలుఅనుమతులు ఇచ్చేశాయి. దాంతో కొత్త సినిమాల హడావుడి మళ్లీ కనిపిస్తుందని ఆశించారు సినీ ప్రేమికులు. అయితే.. థియేటర్లు తెరచుకున్నా.. కొత్త సినిమాలు విడుదలయ్యే దాఖలాలు ఇప్పుడే కనిపించడం లేదు. జులై కూడా చిత్రసీమ స్థబ్దుగానే ఉండబోతోంది. ఎందుకంటే.. నిర్మాతలంతా.. ఆగస్టుపై గురి పెట్టారు. కొత్త సినిమాల రాకడ ఆగస్టు నుంచే మొదలు కాబోతోందని సమాచారం. జులైలో సినిమాల్ని విడుదల చేసే పరిస్థితి లేదు. ఏపీలో రాత్రి కర్షూ కొనసాగుతుండడం, టికెట్ రేట్ల విషయంలో ఓ క్లారిటీ లేకపోవడంతో జులైలోనూ బాక్సాఫీసు ఖాళీగానే ఉండబోతోంది.
ఆగస్టులో మాత్రం కొత్త సినిమాల రాకడ మొదలవుతుంది. ఆగస్టు 6న..`లవ్‌స్టోరీ` విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఆగస్టు 13న `టక్ జగదీష్` వస్తుందని సమాచారం. ఆ మరుసటి వారంలో `విరాటపర్వం` రాబోతోందట. ఆగస్టులో కనీసం అరడజను సినిమాలు విడుదల అవుతాయని, త్వరలోనే వీటికి సంబంధించిన రిలీజ్ డేట్లు బయటకు రానున్నాయని తెలుస్తోంది. ఏప్రిల్ లో.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూతబడ్డాయి. ఆగస్టు వరకూ కొత్త సినిమాల్లేవు. అంటే నాలుగు నెలలు.. టాలీవుడ్ స్థబ్దతలో ఉన్నట్టే.